తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు ఆదివారం మధ్యాహ్నం డ్యాం నుండి నీటిని విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని ఆదేశాలు జారీచేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల వారికి సూచించారు. భారీవర్షాలు పడితే చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. గతంలో నగరం మొత్తం మునిగిపోయింది. జనజీవనం అస్తవ్యస్తం అయింది.
చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. టి నగర్, వెలచ్చేరి,గిండిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి చెన్నైలో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిది. పలు ప్రాంతాలలో విద్యుత్ నిలిపేశారు. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వరదముంపు కారణంగా అధికారులకు సెలవులు రద్దుచేశారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు ఎప్పటికప్పుడు జరగాలని సీఎం స్టాలిన్ ఆదేశాలిచ్చారు. తిరువళ్ళూరు, చెంగల్ పట్టు, చెన్నై లకు చేరుకున్నాయి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు. ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటు సహాయ చర్యలు చూడాలన్నారు సీఎం స్టాలిన్.వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు.
