దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్‌జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి.
Read Also: క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్
కాగా గత ఏడాది నవంబరు నెలలో రూ.1,31,526 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు 2019 డిసెంబరుతో పోలిస్తే 2021 డిసెంబరులో 26 శాతం ఎక్కువగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. మరోవైపు 2021-2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నెలవారీగా చూసుకుంటే రూ.1.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా రెండో త్రైమాసికంలో రూ.1.15 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, నకిలీ బిల్లర్లపై తీసుకున్న చర్యలు భారీగా జీఎస్టీ వసూళ్లు రావడానికి దోహదం చేశాయని కేంద్రం పేర్కొంది.
