Site icon NTV Telugu

కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు గూగుల్ నివాళి

ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి టిష్యూ కాన్సర్ పరిశోధనా ప్రయోగశాలను బొంబాయిలో నెలకొల్పారు ఈమె 1917 నవంబరు 11 న మహారాష్టలో జన్మించారు. ఈమె పూణె లోని బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.

ఫెర్గుస్సన్ కాలేజీ నుండి బోటనీలో గ్రాడ్యుయేషన్ చేశారు. కణ జీవశాస్త్రంలో ఎం.యస్సీని పూణే లోని వ్యవసాయ కాలేజీలో చదివిన తర్వాత బొంబాయి యూనివర్శిటీ నుంచి కణజీవశాస్త్రంలో పి.హెచ్ డీ చేశారు. ఎక్స్ పెరిమెంటల్ బయాలజీలో ఆమె అనేక పరిశోధనలు నిర్వహించారు. ఈమె ఇండియన్ కాన్సర్ పరిశోధనా కేంద్రంలో పాథాలజిస్ట్ వి.ఆర్.ఖనోల్కర్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. రణదివే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసేందుకు విదేశాలకు కూడా వెళ్ళారు. డాక్టర్ కమల రణదివె ఎన్నో ప్రయోగాలు చేశారు.

1955లో బ్రెస్ట్ కేన్సర్ మీద యూరోపియన్ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ తో కలసి అధ్యయనం చేశారు. సెల్ టిష్యూ, ఆర్గాన్ కల్చర్ మీద 1972 లో పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏకైక మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహారాష్ట్ర కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 1991 లో మహారాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దాదాపు 250 పరిశోధనా పత్రాలను, గ్రంథ రచనలు వెలువరించిన డాక్టర్ కమల టాటా మెమోరియల్ సెంటర్ వారి కేన్సర్ రీసెర్చ్ సెంటర్ లో ఎమిరిటస్ సైంటిస్ట్ గా చిరకాలం పనిచేసి పదవీవిరమణ చేసి 2001 లో మరణించారు.

డాక్టర్ కమల పలు గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 1982 లో బనారస్ హిందూ యూనివర్శిటీ మహిళా మహా విద్యాలయం వారి డిస్టింగ్విష్డ్ హ్యూమన్ అవార్డ్, 1991 లో అద్వితీయ పరిశోధనకు గాను టాటా మెమోరియల్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ అండ్ మెమెంటోను, 1992 లో భారత ప్రభుత్వం వారి పద్మభూషణ్ గౌరవ పురస్కారాలు పొందారు. డా.కమల్ రణదివె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ రూపొందించింది. ఈ గూగుల్ డూడుల్ ట్రెండ్ అవుతోంది.

Exit mobile version