వీగోవీ .. పేరు వెరైటీగా వుంది కదూ.. తీవ్రమయిన బరువుతో ఆపసోపాలు పడేవారికి ఇది దివ్యౌషధం. అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్ షాపులకు పరిగెడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు భారీ డిమాండ్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఈ డిమాండ్ నేపథ్యంలో సప్లయ్ సరిగా జరగడం లేదంటున్నారు. వీగోవీకి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మందులు వచ్చాయి. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వుండడంతో దాని జోలికి ఎవరూ వెళ్ళలేదు.
దీంతో వీగోవీకి డిమాండ్ పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. ఈ మందు ఇంజెక్షన్ రూపంలో లభిస్తుంది. వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవడం వల్ల బరువు అనూహ్యంగా తగ్గుతుంది. అంతేకాదు బాగా తినడం వల్ల బరువు పెరిగే వారిలో ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్ కంపెనీకి ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఈ సంస్థ ఆదాయం 41 శాతం పెరిగిందంటే ఈ మందుకి వున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
కరోనా కారణంగా ఊబకాయంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బరువు పెరిగేవారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో అందరికీ బరువు తగ్గడంపై ధ్యాస పెరిగింది. 2022లో డిమాండ్‌కు సరిపడా స్థాయిలో ఔషధాన్ని ఉత్పత్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. నోవో నోర్డిస్క్ సంస్థకు ఎంతో చరిత్ర వుంది.
గతంలో డయాబెటిస్ చికిత్సలకు సంబంధించిన ఔషధాలను తయారు చేసి, అందరి ఆదరణ పొందింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఈ రంగంపై నోవో దృష్టి సారించింది. అమెరికాలో మూడోవంతు యువకులు స్థూలకాయంతో బాధపడుతున్నారు. భారత్‌లోనూ ఊబకాయుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఔషధం మరింతగా అందుబాటులోకి వస్తే ఊబకాయులు హాయిగా తిరిగేయవచ్చు.