Site icon NTV Telugu

దివాలా తీసిన అణ్వస్త్ర దేశం పాకిస్తాన్‌…!

ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ దివాలా తీసిన అణ్వాయుధ శక్తిగా మారుతుంది. ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పుల వల్లే దానికి ఈ దుస్థితి దాపురించింది. పాకిస్తాన్‌ విదేశీ రుణ భారం దాని జీడీపీ కంటే ఎక్కువ. విదేశీ రుణాలు పెరగడం జాతీయ భద్రతా సమస్యలను సృష్టిస్తుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్థాన్ ఆర్థికంగా దివాలా తీయడం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అనేక భద్రతా పరమైన చిక్కులను సృష్టిస్తుంది.

ప్రస్తుతం పాకిస్తాన్‌ విదేశాలకు 127 బిలియన్ డాలర్ల (రూ. 9,51,642 కోట్లు) అప్పు ఉంది. ఇప్పటి వరకు దానికి ఇదే అత్యధిక విదేశీ రుణం. అవకాశం ఉన్న ప్రతి చోట అప్పు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రపంచ ద్రవ్యనిధి- ఐఎంఎఫ్‌, పారిస్ క్లబ్ నుంచే గాక స్థానిక వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా భారీగా రుణాలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రుణాలు తీసుకునే వేగం పెరిగింది. ఐతే, అప్పులు పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలే కారణమని ఇమ్రాన్‌ ఖాన్ సర్కార్‌ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వాలు తీసుకున్న అప్పులను వడ్డీతో తిరిగి కట్టాల్సిన రావటం వల్ల మళ్లీ రుణాలు తీసుకోవాల్సి వచ్చిందనేది ప్రభుత్వ వాదన. ఐతే, సర్కార్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న బలహీన విధానాలే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణం అన్నది నిపుణుల మాట.

గత పదమూడేళ్లలో పాకిస్తాన్ లో మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవి పీపుల్స్ పార్టీ -పీపీపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ -పీటీఐ. పీపీపీ పాలన మొదలైనపుడు విదేశీ రుణం సుమారు రూ. 3,37,198 కోట్లు. 2013లో పీపీపీ పాలన ముగిసే నాటికి రూ.4,57,099 కోట్లుకు చేరింది. ముస్లింలీగ్‌ హయాం ముగిసేప్పటికి విదేశీ రుణ భారం రూ.7,11,944 కోట్లు. ప్రస్తుత పీటీఐ పాలనలో రూ.9,51,642 కోట్లకు చేరింది. ఈ లెక్కల ప్రకారం పీపీపీ పాలనలో విదేశీ రుణం 16 బిలియన్ డాలర్లు పెరిగితే, నవాజ్ లీగ్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లు పెరిగింది. వీటితో పోల్చి చూస్తే పీటీఐ హయాంలో కేవలం 39 నెలల్లోనే విదేశీ రుణం 32 బిలియన్ డాలర్లు పెరిగింది

విదేశీ రుణాలు పెరగడానికి ప్రధాన కారణం ఐఎంఎఫ్ నిబంధనలు. ఇప్పుడు వడ్డీ రేటు 6.50 నుంచి 13.25కి, మారకం రేటును 121 నుంచి 166కు పెరిగింది. ఈ రెండు కారణాల వల్ల రుణాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, పాకిస్తాన్ దిగుమతులు పెరిగాయి. ఇది విదేశీ మారక నిల్వల క్షీణతకు దారితీసింది. గత ఐదు వారాలుగా విదేశీ మారక నిల్వలు అదే పనిగా క్షీణిస్తున్నాయి. పాకిస్తాన్‌ రూపాయి ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీగా మారింది.

ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఆయిల్‌ ఉత్పత్తులు, మెషినరీ, వాహనాల అధిక వినియోగంతో దిగుమతులు పెరిగాయి. దిగుమతులు పెరిగిన స్థాయిలో ఎగుమతులు పెరగలేదు. అది వాణిజ్య లోటుకు దారితీసింది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు పెరిగి విదేశీ మారక విలువ పడిపోయింది. అందుకే దేశం ఒక సంక్షోభంలో చిక్కుకుంది.

రానున్న మూడు, నాలుగేళ్లలో 14 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులను పాకిస్తాన్‌ తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో సౌదీ అరేబియా మరోసారి పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకొచ్చింది. పాకిస్తాన్‌కు 4.2 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. సౌదీ అరేబియా, యూఏఈలు గతంలో చాలాసార్లు పాకిస్తాన్‌ను ఇలాగే ఆదుకున్నాయి. ఇవికాకుండా, 1980ల నుంచి ఇప్పటి వరకు 13వ సార్లు ఐఎమ్‌ఎఫ్‌ నుంచి లోన్‌ తీసుకుంది.

ఇక, ఈ దివాలా లెక్కలను పక్కన పెట్టి, అసలు దానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై దృష్టి పెట్టాలి. తక్కువ ఆదాయపు పన్ను రాబడులు, విపరీతమైన రాజకీయ అవినీతి, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థల డిమాండ్‌కు అనుగుణంగా కఠినమైన ఆర్థిక సంస్కరణలను విధించడానికి ఇష్టపడకపోవడం వంటి వాటితో పాటు దేశం ఆర్థిక దివాలా తీయడానికి ఇంకా ప్రధాన కారణాలు ఏమిటన్నది చూడాలి.

మొదటి నుంచి పాకిస్తాన్‌ తనను తాను ఎక్కువగా ఊహించుకోవటమే ఈ ఆర్థిక దుస్థితికి దారితీసింది. దశాబ్దాలుగా అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ వాడుకుని దానిని ఒక అద్దె దేశంగా మార్చింది. అయితే, అమెరికాకు ఇప్పుడు పాకిస్తాన్‌తో అవసరాలు తగ్గాయి. దాంతో పాటే ప్రేమ కూడా తగ్గింది. ఒసామా బిన్‌ లాడెన్‌ హత్య తరువాత పాకిస్తాన్‌పై అమెరికా నమ్మకం కోల్పోయింది. దానికి ఏటేటా అందించే నిధులలో గణనీయంగా కోత పెట్టింది.

అమెరికా సాయం దూరమవటంతో కొన్నేళ్లుగా అప్పు కోసం పాకిస్తాన్‌ పక్క చూపులు చూస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా స్థానంలో మరింత ప్రమాదకరమైన చైనా ప్రవేశించింది.రెండు మూడేళ్లుగా ఆ దేశంతో వ్యూహాత్మకం వాణిజ్యం నెరుపుతోంది. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ వంటి ప్రాజెక్టులకు తెరమీదకు తెచ్చింది. దాంతో అది చైనా ఆర్థిక ఉచ్చులో చిక్కుకుంది.

పాకిస్తాన్ దివాలాకు అమెరికా, చైనాతో పాటు సౌదీ అరేబియా కూడా పెద్ద కారణమే. సౌదీ ఆర్థిక సాయం వెనుక ఉన్నది తోటి ఇస్లామిక్ దేశం అనే ఔదార్యం మాత్రమే కాదు. అణ్వాయుధ సాంకేతికత, బ్లూప్రింట్లకు బదులుగా పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక సహాయం అందించింది. నిజానికి పాకిస్తాన్‌ని ఆర్థికంగా ఆదుకోవటానికి ఇరాన్‌తో దానికి ఉన్న శతృత్వం కూడా కారణమే.

ఇక, పాకిస్తాన్ దివాలాకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి. విపరీతమైన రక్షణ ఖర్చులు. ముఖ్యంగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులపై ఎక్కువగా ఖర్చు చేసింది. రక్షణ పరంగా భారత్‌తో వ్యూహాత్మక సమానత్వం కోసం భారీగా అప్పులు చేసింది. పాకిస్తాన్ అర్థికంగా చితికి పోవటానికి ఇది మొదటి ప్రధాన కారణం

మరోవైపు, ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్‌తో “చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)” ప్రాజెక్టు ప్రారంభించింది చైనా. అందుకు ఎంత కావాలంటే అంత ఇచ్చింది. ఫలితంగా ఈ పేద అణ్వాయుధ దేశం చైనా ఆర్థిక మత్తుకు అలవాటు పడిపోయింది. చైనా ఆకర్షణలకు లోనై తన జాతీయ, ఆర్థిక భద్రతతో వ్యాపారం చేసింది. “అప్పు ఉచ్చు” బిగించి పాక్‌ పై వ్యూహాత్మక పట్టు సాధిస్తోంది.

ఇక, గత వారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన చెప్పినట్టు ఈ దివాలా ప్రధాన జాతీయ భద్రతా సమస్యగా మారింది. కాని ఆయన వివరణాత్మక కారణాలు చెప్పలేదు. అధిక ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి విలువ కారణంగా కారణంగా తలెత్తే ఆర్థిక అశాంతి గురించి ఆయన ప్రస్తావించారా? లేదంటే సైనిక అవసరాలకు తగిన ఆర్థిక వనరుల గురించి మాట్లాడరా ..అనేది తెలియదు.

ఐతే, పాకిస్తాన్ జాతీయ భద్రతపై ప్రభావం చూపుతున్నందున రెండింటిని పరిగణనలోకి తీసుకుని విశ్లేషించాలి. దేశంలోని రాజకీయ అసంతృప్తి తీవ్రమై అది సుపరి పాలనతో పాటు నియంత్రణపై ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా పాకిస్తాన్ మరోసారి ‘ఫెయిల్డ్ స్టేట్’ హోదాకు చేరవచ్చు. చైనాతో పూర్తిగా జతకట్టిన పాకిస్తాన్‌ను ఈసారి అమెరికా ఆర్థికంగా ఆదుకునే అవకాశం లేదు.

రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌ ఆర్థిక కష్టాల నుంచి చైనా బయటపడేసింది. కానీ, ఇప్పుడు అందుకు సిద్ధంగా లేదు. సీపీఈసీ రుణాల చెల్లింపుల్లో పాకిస్తాన్‌ పూర్తిగా విఫలం కావటం, అలాగే ప్రస్తుత దాని దివాలా పరిస్థితితో చైనా తనకు తాను సాయం చేయదు. తన వ్యూహాత్మక ప్రయోజనాలకు పాకిస్తాన్ ఆమోద ముద్ర వేయించుకోకుండా ఇందులో అడుగు పెట్టదు. వాటిలో వ్యూహాత్మక గ్వాదూర్ నౌకాశ్రయంపై పూర్తి నియంత్రణకు డిమాండ్ చేస్తుంది. దాంతో సీపీఈసీ రోడ్డు, రైలు మార్గాలతో చైనాతో కలిసే ప్రధాన నౌకా స్థావరంగా గ్వాదూర్ మారుతుంది. దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలి వెళ్లిన బాగ్రామ్ వైమానిక స్థావరంపై కూడా చైనా కన్ను పడింది. దానిని లీజుకు ఇచ్చేలా తాలిబన్‌ ప్రభుత్వంపై పాకిస్తాన్‌ వొత్తిడి తేవాలి.

చైనా డిమాండ్లకు పాకిస్తాన్‌ తల ఊపితే భారతదేశం, ఇరాన్‌లకు వ్యూహాత్మక చిక్కులు ఏర్పడతాయి. భారత్‌ ఇప్పటికే దీని మీద దృష్టి పెట్టింది. ఇక, ఇరాన్ పాకిస్తాన్ మాదిరిగా అద్దె దేశం కాదు. ఇరాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితే వస్తే స్పందన తీవ్రంగా ఉంటుంది.

నిజానికి, చైనా-పాకిస్తాన్ మధ్య ఏనాడూ సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్ పట్ల దాని ఆసక్తి పూర్తిగా స్వార్థపూరితమైనది. పాకిస్తాన్‌ను స్వావలంబన కలిగిన ఓ సుస్థిర దేశంగా చూడాలన్న ఉదారవాద ధోరణి చైనాకు లేదు. ఉండదు కూడా.

-Dr. Ramesh Babu Bhonagiri

Exit mobile version