రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనేట్లు NREGS పథకాన్ని అమలు చేస్తే రైతులు బ్రతకరు అన్నారు ధర్మాన. ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయి. రెండు గంటలు పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు ?
ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ. రైతులకు ఏమైనా ఫర్వాలేదనే పద్దతి కొనసాగించాలని ప్రభుత్వం అనుకుంటే అలాగే వదిలేయండి. వ్యవసాయం కోసం పని చేసే కూలీలకు పని దొరకనప్పుడు NREGS కింద పని ఇవ్వడంలో తప్పులేదు. ప్రజల కోసం సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాము కాబట్టే ఆ పనులు ఆలస్యం అవుతున్నాయి.
సంక్షేమం బాగా చేస్తుండబట్టే అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయి. రెండూ చేయడానికి కొంత సమయం పడుతుంది. పెన్షన్ పెంచామని అంటే.. మరి నూనె ధరలు పెరగలేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.వ్యవసాయం చేసే వారి బ్రతుకులు ఎక్కడా బాగోలేదు. దేశంలోనే వ్యవసాయం కష్టకాలంలో ఉంది. ఒకప్పుడు వ్యవసాయదారులు సంతోషంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎంతో కష్టపడి వరి పండిస్తే కొనేవాడు లేడు.ఒకవేళ అమ్మినా సజావుగా డబ్బులు ఇచ్చేవాడు లేడన్నారు ధర్మాన.
ఈ దేశంలో వరి మన అవసరాలకు మించి పండిస్తున్నాం. కేంద్రం 80 కేజీల ధాన్యానికి 1582 రూపాయలు రేటు నిర్ణయించింది. అది సరిపోదు.. కనీసం 3 వేల రూపాయల పైన ఉండాలనేది నా భావన. దేశంలో ఏ ఒక్క వ్యవసాయదారుడు సంతోషంగా లేడు. ఎవరింట్లో చూసినా విషాదమే కనిపిస్తుంది. రాష్ట్రంలో రోడ్లు, ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే అని అంగీకరించారు ధర్మాన ప్రసాదరావు.