Site icon NTV Telugu

గౌతం గంభీర్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం

BJP MP GAUTAM GAMBHIR

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. తనను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి ఈ మెయిల్స్ రూపంలో బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని గౌతమ్ గంభీర్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also: చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు

ఎంపీ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని… మంగళవారం రాత్రి 9:32 గంటల సమయంలో గంభీర్‌కు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు ఢిల్లీ డీసీపీ శ్వేతామోహన్ వెల్లడించారు. సదరు ఈ మెయిల్‌లో గంభీర్, అతడి కుటుంబ సభ్యులను చంపేస్తామని ఉగ్రవాదులు పేర్కొన్నారని తెలిపారు. గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈమెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన గంభీర్ 2018లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి 2019 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందాడు.

Exit mobile version