ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం చేయరాదు. ఎందుకంటే అతి వ్యాయామం అనర్థాలకు దారి తీస్తుంది. మీరు చేసే వ్యాయామం మీతిమీరుతుందని గుర్తించడానికి కొన్ని లక్షణాలు తోడ్పడతాయి. అవేంటంటే..
✤ బరువు పెరగడం: వ్యాయామాలు మితిమీరితే శరీరం దీర్ఘకాల ఒత్తిడిని ఎదుర్కొనే స్థితిలో ఉంటుంది. దీంతో కార్టిజోల్ అనే ఒత్తిడి హార్మోన్ మోతాదు పెరుగుతుంది. ఇది జీవక్రియలను అడ్డుకుని బరువు పెరిగేలా చేస్తుంది.
✤ కండరాల నొప్పి: మొదట్లో వ్యాయామం ఆరంభించినప్పుడు కండరాల నొప్పి రావడం సహజమే. అయితే ఆ నొప్పి క్రమంగా తగ్గుతుంది. మరీ వారమైనా తగ్గకపోతే వ్యాయామాలు శ్రుతి మించాయని అర్థం. కండరాలు కోలుకోకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేకపోతే దీర్ఘకాలం నొప్పులు వేధిస్తూనే ఉంటాయి.
✤ మూడ్ మారటం: అతి వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చురుకుదనం తగ్గేలా చేయవచ్చు. చీటికి మాటికీ కోపం రావడం, పెంకితనం, విచారం, ఆందోళన, కుంగుబాటు, మూడ్ మారిపోవడం వంటివి తలెత్తవచ్చు
✤ గుండె దడ: అతి వ్యాయామంతో విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకోవచ్చు. వ్యాయామాలకు అనుగుణంగా మారడానికి శరీరం ఎక్కువసేపు ప్రయత్నిస్తూ ఉంటుంది. దీంతో విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె వేగం తీరు మారిపోవచ్చు.
✤ నిద్రకు భంగం: వ్యాయామం చేస్తే మంచిగా నిద్ర పడుతుంది. కానీ వ్యాయామం శ్రుతిమించితే అదే శాపంగా మారుతుంది. అతిగా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ప్రశాంతతకు దోహదం చేసే పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. రాత్రిపూట కార్టిజోల్ హార్మోన్ మోతాదులు ఎక్కువగానూ ఉంటాయి. ఇవన్నీ నిద్రకు భంగం కలిగిస్తాయి.