NTV Telugu Site icon

భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఈటెల రాజేందర్

తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు.

Read Also: బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లుగా టీడీపీ నేతలు

మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీపై ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఉపఎన్నిక కోసం కొన్ని వందల కోట్లను టీఆర్ఎస్ ఖర్చుచేసిందని, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ జీవోల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి డబ్బును, మద్యాన్ని పంచిపెడుతున్నారని ఈటెల మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని.. ఏదేమైనా అంతిమంగా ధర్మం విజయం సాధిస్తుందని ఈటెల స్పష్టం చేశారు.