NTV Telugu Site icon

జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రిపై హెచ్చార్సీ విచారణ

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని రోగులు వాటిని ఆశ్రయిస్తుంటారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్పుకోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన కాన్పు కోసం చేరిన బొంతు సునీత అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కాన్పు కోసం సర్జరీ కిట్ బయట నుండి కొనుగోలు చేసి తీసుకురావాలని భర్త బొంతు మధు కి తెలిపారు ఆసుపత్రి సిబ్బంది. పురిటి నొప్పులు ఎక్కువగా వస్తున్నా కూడా స్పందించలేదు ఏరియా ఆసుపత్రి సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం పదివేలు, కోవిడ్ పరీక్షకు ఐదువందల రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేశారు.

ఇదేమని అడిగిన భర్త మధు పై దుర్భాషలాడారు వైద్య సిబ్బంది. గత్యంతరం లేక భార్యని కాన్పు కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు భర్త బొంతు మధు. జరిగిన అన్యాయం పై హెచ్చార్సీని ఆశ్రయించారు దంపతులు. హెచ్.ఆర్.సి ఆదేశాలతో ఆసుపత్రిలో విచారణ చేపట్టారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ ఎం.పద్మ, ఆమె బృందం. విచారణ ఆనతరం పూర్తి వివరాలని హెచ్చార్సీకి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడించారు.