Site icon NTV Telugu

తెలంగాణలో థర్డ్‌వేవ్‌ వస్తే సిద్ధంగా ఉన్నాం : డీహెచ్ శ్రీనివాస్ రావు

దక్షిణాఫ్రికాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే కరోనా వేరియంట్లతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వేరియంట్‌ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రధాని మోడీ కూడా దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి హరీష్‌రావు వైద్యాశాఖ ఉన్నతాధికారులతో ఈ రోజు రెండు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్ష అనంతరం తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ పై అప్రమత్తమయ్యామని వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో రెండు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాల నుంచి వస్తున్న వాళ్లపై నిఘా పెట్టనున్నామని, వాళ్ళను ట్రేస్ చేయడం, టెస్ట్ చేయడం పై దృష్టి పెడుతామన్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా… ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం, 5 నెలలుగా కేసులు బాగా తగ్గాయి, వేరియంట్ ఏదైనా సరే… కోవిడ్ నుంచి మనల్ని కాపాడేది వ్యాక్సినే, రెండు డోసులు తీసుకుంటేనే.. పూర్తి రక్షణగా ఉంటాం. ఇప్పటివరకు 45 శాతం మంది మాత్రమే తీసుకున్నారు.. గుంగుంపులుగా ఉండొద్దు.. జనాలు జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ తప్పనిసరిగా వాడాలి.. భౌతిక దూరం పాటించాలి. కేసులు తగ్గాయని.. జనాల్లో నిర్లక్ష్యం వచ్చింది. కానీ.. మరోసారి అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చింది. యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే.. ఇప్పుడు కోవిడ్ బారిన పడుతున్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ.. ఖచ్చితంగా సెకండ్ డోస్ తీసుకోవాలి. కోవిడ్ పూర్తిగా కనుమరుగు అయ్యింది అని అనుకోకండి అంటూ సూచనలు చేశారు.

Exit mobile version