అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది.
ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువుల సాంద్రత పెరగడం మూలంగా “ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 400 నుంచి 500 వరకు నమోదౌతోంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 457 గా నమోదైంది. గత మూడేళ్ళలో ఇది గరిష్టం అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఒక క్యూబిక్ మీటర్ లో 2.5 మైక్రాన్స్ పరిమాణంలో ఉన్న ధూళి అణువులు 457 ఉన్నట్లు లెక్క.
ఇటు ఆందోళనలకు కేంద్రబిందువైన జంతర్ మంతర్ వద్ద ఎయుర్ క్వాలిటీ 341 ఉన్నట్లు నమోదయింది. ఆదివారం సాయంత్రం నుంచి క్రమేపి కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్న “సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్” తెలిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 100 లోపు నమోదైతేనే దేశ రాజధాని పౌరులకు ఊరట కలిగే అవకాశం వుందంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండక్స్” 25 ఉంటేనే క్షేమకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఛాతి సమస్యలు, గుండె జబ్బులున్న వారికి ఈ కాలుష్యం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు వైద్యులు.
“కోవిడ్-19” బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి కూడా ఈ కాలుష్యం ప్రాణాంతకం అని అంటున్నారు వైద్యులు. 10 నుంచి 15 శాతం బాలబాలికలు ఆస్థ్మా తో బాధపడుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనిహెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రపంచంలోని అన్ని రాజధానుల్లో కెల్లా ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన “గాలి నాణ్యత” ఉన్న దేశ రాజధాని గా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ పౌరులు ముంచుకొస్తున్న ప్రమాదకర పరిస్థితిని ఏ మాత్రం అర్ధం చేసుకోవడం లేదు. యధేచ్ఛగా అన్ని నిషేదాజ్ఞలను ఉల్లంఘించి “దీపావళి” క్రాకర్స్ ను కాల్చి విషతుల్యమైన కాలుష్యానికి కారణమౌతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ నిపుణులు.
