దేశంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నూనెతో వంట చేసుకోవాలంటే అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ నేపథ్యంలో హోల్‌సేల్‌గా విక్రయించే లీటరు నూనెను రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించింది. నూనెల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా పండగ దృష్ట్యా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
Read Also: మరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు
మరోవైపు కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు టన్నుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు తగ్గిస్తున్నట్లు ఎస్‌ఈఏ అధికారులు వెల్లడించారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పామాయిల్ నూనెల ధరలు 22 శాతం తగ్గగా… లీటర్ పామాయిల్ నూనె రూ.133కి తగ్గింది. వేరుశనగ నూనె రూ.181.97, పొద్దుతిరుగుడు నూనె రూ.168, ఆవనూనె రూ.185కి తగ్గినట్లు ఎస్ఈఏ అధికారులు గుర్తుచేశారు.
