పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతోనే పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించారని ఆరోపించారు. ఈ నిర్ణయం భయంతో తీసుకున్నదే తప్ప మనస్ఫూర్తిగా కాదని ఆమె పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలను భారీగా పెంచి.. ఎన్నికల ముందు కంటితుడుపుగా తగ్గించిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.
