NTV Telugu Site icon

హుజురాబాద్‌ ఫలితం.. రేవంత్‌ని మళ్లీ టార్గెట్‌ చేసిన కోమటిరెడ్డి

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెలువడలేదు.. కానీ, ఈ ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోయిన కాంగ్రెస్‌లో మాత్రం అప్పుడే రచ్చ మొదలైంది.. అవకాశం దొరికినప్పుడల్లా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసే ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ ఎన్నికల ఫలితాలపై హాట్‌ కామెంట్లు చేశారు.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 5 నెలలు అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక్క సభ కూడా పెట్టలేదని మండిపడ్డారు.

ఇక, దుబ్బాక, నాగార్జునసాగర్‌లో పని చేసినట్టుగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదన్నారు కోమటిరెడ్డి… కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో గట్టి క్యాడర్ ఉంది.. అయినా తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.. మరోవైపు, హుజురాబాద్ పై వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు వివరిస్తానన్నారు కోమటిరెడ్డి.. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. కార్యకర్తలు అధైర్యపడొద్దన్న ఆయన.. కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు. ఇక, కోటమిరెడ్డి తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కొత్త రచ్చకు తెరలేపినట్టు అయ్యింది.. ఆయన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.