Site icon NTV Telugu

ఏపీసీసీ చీఫ్ మార్పుపై హైకమాండ్ తర్జనభర్జన

ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది.

ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, మస్తాన్ వలీ వున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రెండు రోజుల పర్యటనలో విడివిడిగా భేటీ అయిన కాంగ్రెస్ వ్యవహరాల ఏపీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఈమేరకు ఒక నిర్ణయానికి రాలేకపోయారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి.. ఈ దఫా ఓసీలకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని పలువురు నేతలు చాందీకి సూచించారని తెలుస్తోంది.

తనకు మరోసారి అవకాశమిస్తే కొనసాగేందుకు సిద్దమన్నారు ప్రస్తుత పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్. కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డిలతో సంప్రదించాకే పీసీసీ చీఫ్ పదవిపై తుది నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ కాంగ్రెస్ నేతల సూచించారు. ఇకపై కేవీపీ, కిరణ్, రఘువీరాలు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని నేతలతో చెప్పారు ఉమెన్ చాందీ.

2023 నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం వుండడంతో రెండేళ్ళలో పార్టీని గాడిన పెట్టేందుకు రాబోయే పీసీసీ సారథి ఏమేరకు సఫలీకృతుడు అవుతాడో చూడాలి. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఏపీలోని రెండు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. కనీసం స్థానిక ఎన్నికల్లోనూ ఉనికిని చాటుకోలేక పోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమనే చెప్పాలి. కొత్త బాస్ కి పార్టీని ముందుకు నడిపించడం నల్లేరు మీద బండి నడక కాబోదనే చెప్పాలి. ఐదుగురు నేతల్లో ఎవరి వైపు అధిష్టానం మొగ్గుచూపుతుందో చూడాలి.

Exit mobile version