హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో హుజూరాబాద్ లో ఎవరు జెండా ఎగురవేస్తారా? ఆసక్తి నెలకొంది. పోలింగ్ సమయంలో దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రచారం ముగింపు రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేలా భారీ బహిరంగ నిర్వహించి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.
హూజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తరుఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పెద్దలు ఈటలకు అన్నిరకాల సహకారం అందిస్తున్నారు. దీంతో బీజేపీ ప్రచారంలో దూసుకెళుతోంది. ఇక టీఆర్ఎస్ తరుపున మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను భుజాన మోస్తున్నారు. మంత్రులు గుంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు స్థానికంగా ఉంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు ముఖ్యనేతలు హుజూరాబాద్లో స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో వీరంతా రంగంలోకి దిగి టీఆర్ఎస్ లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం చివరి రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ముగించనున్నారని తెలుస్తోంది. ఈనెల 30న పోలింగ్ తేది ఉండగా 72గంటల ముందుగానే హుజూరాబాద్ లో ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటన ఈనెల 27న ఖరారైంది. ఈ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ప్రచారంలో ఆయన ఏం మాట్లాడుతారనే ఆసక్తి నెలకొంది.
హుజూరాబాద్ లోని ఓటర్ల మనోగతం తెలుసుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే రెండుసార్లు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని సమాచారం. దాదాపు 13శాతం ఓట్ల లీడ్ టీఆర్ఎస్ కు ఉందని తేలడంతో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాక ఖరారు కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఓటర్లపై వరాలవర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తనదైన స్టైల్లో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ప్రచారాన్ని ముగించేందుకు సిద్ధమవుతుండటం ఉత్కంఠతను రేపుతోంది.
