Site icon NTV Telugu

‘చిరు 154’… పూనకాలు లోడింగ్!?

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు. అందులో ‘పూనకాలు లోడింగ్’ అనే కాప్షన్ పెట్టడంతో ఈ మూవీ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం అనిపిస్తోంది. అదే సమయంలో చిరంజీవి గెటప్ చూస్తుంటే ఇది ఫక్తు మాస్ మసాలా మూవీ అనే భావన కలుగుతోంది. అదే నిజమైతే… అందులో చిరంజీవి పోషిస్తున్న పాత్ర పేరు ‘పూనకాలు’ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read Also: వచ్చే యేడాదిలోనే ‘కేజీఎఫ్ 2’! నిరాశలో యశ్ ఫ్యాన్స్!!

సముద్రంలోకి ప్రయాణమైన ఓ నాటు పడవలో చివరగా చిరంజీవి నిలబడి నోట్లో సిగరెట్ పెట్టుకుని, ఓ చేతిలో లంగరును పట్టుకుని, లుంగీతో స్టైల్ గా నిలుచోవడం చూస్తుంటే ఇది మాస్ కా బాప్ అనేది అర్థమౌతోంది. అదే సమయంలో డైరెక్టర్ బాబీ ‘మాస్ మాన్ స్టర్… బాక్సాఫీస్ గా గ్యాంగ్ స్టర్’ అనే పదాలతో మూవీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చెప్పకనే చెప్పేశాడు. చిరంజీవి ఇందులో చేయబోతోంది బేస్త యువకుడి పాత్రే అయితే… గతంలో ‘ఆరాధన’లో ఇలాంటి పాత్రే పోషించి, మెప్పించాడు. కానీ ఇందులో మాత్రం పెద్ద గ్యాంగ్ లీడర్ ను చిరు తలపిస్తున్నాడు. ఏదేమైనా… దర్శక నిర్మాతలు ఈ మూవీకి సంబంధించి మరింత క్లూ ఇస్తారేమో చూడాలి! ఈ సినిమా సైతం త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. సో… ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ తో పాటే చిరు 154 మూవీ చిత్రీకరణ జరిగే ఆస్కారం కనిపిస్తోంది. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’కి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

Exit mobile version