ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్‌లో చిరంజీవి పోస్ట్ చేశారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నుండి తమిళనాడులోని తిరుపత్తూర్ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. పెద్దబంగారు నత్తం వద్ద రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర రహదారిని మూసివేయడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సత్యవేడు మండల పరిధిలోని ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వాగులు, వంకలు వంతెన వద్ద అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. వీఆర్ కండ్రిగ వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన కల్వర్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో పోలీసులు నిఘా ఉంచాలని ఆదేశించారు. ఊతుకోట, కడూరు క్రాస్ మార్గాల నుంచి భారీ వాహనాలు సత్యవేడు మీదుగా నడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also: విషాదం నింపుతున్న వరదలు.. హెలికాప్టర్ తో గాలింపు చర్యలు