Site icon NTV Telugu

పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలి: చంద్రబాబు

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించినా ఏపీలో తగ్గించకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేం: మంత్రి బుగ్గన

మరోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం సిగ్గుచేటు అని చంద్రబాబు మండిపడ్డారు. తమ విద్యాసంస్థను కాపాడుకునేందుకు పిల్లలు ఆందోళనలు చేస్తే వారిపై దాడులు చేస్తారా అని నిలదీశారు. ప్రశ్నించే వారు ప్రతిపక్షమైనా, ప్రజలైనా దాడులు చేయడమే జగన్ ప్రభుత్వం ఉద్దేశమా అని ప్రశ్నించారు. నిలదీసే విద్యార్థులకు లాఠీదెబ్బలే జవాబులా? ఇదే ప్రజాస్వామ్యమా? అని… ఇది రాక్షస రాజ్యమా అని సూటి ప్రశ్నలు వేశారు. మేనమామ అంటే బతుకు కోరేవాడు అని.. ఇలా బడి మూసేవాడు కాదని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Exit mobile version