Site icon NTV Telugu

వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు

కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు.

Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ : నారా లోకేష్

భారీ వర్షాలకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఆకాశంలో విహరిస్తే.. కింద ఉన్న బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్, సీఎం అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్… వరదల వల్ల సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారితే 5 లక్షల పరిహారం మాత్రమే ప్రకటించడం న్యాయమా అని ప్రశ్నించారు. వరదల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version