తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది.
Read Also: ఎన్నికల సంఘం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,321.57 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.
