2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు పెరగనున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సిమెంట్ తయారీకి వాడే బొగ్గు ధర 120 శాతం పెరిగిందని.. అటు పెట్‌కోక్ ధర 80 శాతం వరకు పెరిగిందని కంపెనీలు చెప్తున్నాయి. వీటికి తోడు రవాణా ఛార్జీలు కూడా 5 నుంచి 10 శాతం పెరగడంతో ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో సిమెంట్ కంపెనీలు బస్తా ధరను బ్రాండ్ ఆధారంగా రూ.20 నుంచి రూ.30 వరకు పెంచిన సంగతి తెలిసిందే.
Read Also: ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబడులు
మరోవైపు వచ్చే ఏడాది కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంచాలని మారుతీ, ఆడి, మెర్సిడెస్ కంపెనీలు నిర్ణయించాయి. కార్ల తయారీకి ఉపయోగించే మెటీరియల్ ఖర్చులు పెరిగిపోవడంతో పలు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ధరల పెంపు మోడల్‌ను బట్టి ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల కార్ల రేటును 3 శాతం పెంచుతున్నట్లు ఆడీ వెల్లడించింది. అటు జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల కార్లను 1-2 శాతం వరకు పెంచుతామని మెర్సిడీస్ బెంజ్ ప్రకటించింది. గత ఏడాదిగా తయారీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కంపెనీలు కస్టమర్లపై వేస్తున్నాయి.
