సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు గమనించండి.. ఓ బలిష్టమైన వ్యక్తి వారిని నీడలా అనుసరిస్తుంటాడు. అతడే వారి పర్సనల్ బాడీ గార్డు…అనగా వ్యక్తిగత అంగరక్షకుడు. ఐతే ఈ బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందనుకుంటున్నారు.. నెలకో యాబై అరవై వేల వరకు ఉంటుందా? ఇంకా ఎక్కువేనా..?
సెలబ్రిటీ బాడీగార్డుల జీతాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పెద్ద పెద్ద సర్కార్ కొలువులు చేసేవారికి కూడా అంత ఉండదేమో. పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా అంత పెద్ద ప్యాకేజీ కష్టమే.
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అంగరక్షకుడు జితేంద్ర షిండే ఏడాది జీతం అక్షరాలా కోటిన్నర. షిండే చాలా ఏళ్లుగా బిగ్ అమితాబ్ దగ్గర పని చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటే ఉండి రక్షణ కల్పిస్తాడు. ఒక్క అమితాబే కాదు ఇతర సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ కూడా వారి పర్సనల్ బాడీగార్డుల కోసం భారీగానే వెచ్చిస్తున్నారు.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డు షెరా జీతం ఏడాదికి రెండు కోట్లని చెబుతారు. గత 20 ఏళ్లుగా అతడు సల్మాన్ వ్యక్తిగత అంగరక్షకుడుగా వ్యవహరిస్తున్నాడు. బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్, అమెరికన్ సింగర్ జస్టిన్ బీబర్ ఇండియా వచ్చినప్పుడు వారి సెక్యూరిటీ బాధ్యత షెరానే చూసుకున్నాడని సమాచారం.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ పర్సనల్ బాడీగార్డ్ పేరు రవి సింగ్. షెరా మాదిరిగా పెద్ద పేరు లేకపోవచ్చు కానీ షారూఖ్ దగ్గర పదేళ్లుగా ఉన్నాడు. రవికి ఏటా రెండు కోట్ల డెబ్బయ్ లక్షలు చెల్లిస్తాడని చెబుతాయి బాలివుడ్ వర్గాలు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డుగా రవి గుర్తింపు పొందాడు.
అనుష్క బాడీగార్డ్ సోను వార్షికంగా 1.2 కోట్లు తీసుకుంటాడు. విరాట్ కోహ్లీని అనుష్క కలవక ముందునుంచే ఆమెకు సెక్యూరిటీగా ఉన్నాడు. ఇప్పుడ అనుష్కతో పాటు భర్త విరాట్,కూతురు వామిక సెక్యూరిటీ బాధ్యత కూడా అతనిదే.
దీపిక పడుకోన్ పర్సనల్ బాడీగార్డ్ జలాల్ ఏడాదికి కోటీ ఇరవై లక్షల వరకు జీతంగా తీసుకుంటాడు. జలాల్‌ని తన అన్నగా భావిస్తుంది దీపిక. ప్రతి ఏటా రాఖీ కడుతుంది.
సెలబ్రిటీలు గడప దాటితే జనం చుట్టుముడుతారు. అందుకే వెంట సెక్యూరిటీ ఉండాల్సిందే. ఎదురొచ్చిన వారిని పక్కకి తోసేయటమే వీరి పని. లేకపోతే సెల్ఫీలంటూ, ఆటోగ్రాఫ్ గోల చేస్తారు. ఎటూ కదలనీయరు. అందుకే తప్పదీ సెక్యూరిటీ. షూటింగైనా..ఈవెంటైనా, విహారమైనా ఎక్కడికెళ్లినా ఈ అరేంజ్‌మెంట్స్ తప్పవు మరి.