ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు.. ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీపై గురువారం రాత్రి బారాబంకి నగర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఒవైసీపై కేసు నమోదు చేయబడిందని, మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వాధినేతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింది ఎఫ్‌ఐఆర్ నమోదు చేవామని బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్, యమునా ప్రసాద్ తెలిపారు. కాగా, గురువారం జరిగిన పార్టీ ర్యాలీలో భారీ జనసమూహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ ఎంపీ కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని.. మాస్క్‌లు ధరించకపోవడం.. భౌతికదూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోలేదన్నారు. ఇక, తన ప్రసంగంలో ఎంఐఎం చీఫ్ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రకటనలు చేశారని.. 100 సంవత్సరాల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ధ్వంసం చేశారని.. దాని శిథిలాలు కూడా తొలగించబడ్డాయని కామెంట్ చేశారని.. ఇది వాస్తవానికి విరుద్ధం అన్నారు ఎస్పీ.. ఈ ప్రకటన ద్వారా, ఒవైసీ మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి మరియు ఒక నిర్దిష్ట సమాజంలోని భావాలను ప్రేరేపించడానికి ప్రయత్నించాడని.. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అనుచితమైన, నిరాధారమైన వ్యాఖ్యలు కూడా చేశారని వెల్లడించారు.