ఇవాళ రాజస్థాన్ కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం.. కేబినెట్‌లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పైలట్ టీంకు మెజార్టీ పోర్టు పోలియోలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరీ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్‌లు కేబినెట్ నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్నారు. మంత్రి గోవింద్ సింగ్ రాజస్థాన్ పీసీసీ అధ్యక్షునిగా ఉండగా.. మిగతా ఇద్దరిలో డాక్టర్ రఘుశర్మ, హరీష్ చౌదరీలు గుజరాత్, పంజాబ్ పార్టీ వ్యవహారాల బాధ్యులుగా నియమితులయ్యారు. పైలట్ వర్గానికి 12 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గత కొన్నాళ్లు సీఎం గెహ్లాట్, పైలట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. పైలట్ తిరుగుబాటు చేయడంతో.. రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. కానీ రాహుల్ గాంధీ చొరవతో సమస్య సద్దుమణిగింది. లేదంటే సింధియా మాదిరిగా.. పైలట్ కూడా పార్టీ మారే అవకాశం ఉండేది.
