Site icon NTV Telugu

కేసీఆర్‌ ప్రచార హోరు అమిత్‌ షాతో చెక్‌!

హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్‌ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్‌లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకున్నారు. ఇందులో మంత్రి హరీష్‌ రావు ముఖ్య పాత్ర పోషించారు. ఇటు సామాజిక వర్గాలపై కూడా టీఆర్‌ఎస్‌ పట్టు బిగిస్తోంది. అయితే వీరు ఎంత ప్రచారం చేసినా కేసీఆర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆపార్టీ కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ముగిసే లోగా కేసీఆర్‌ ఒక్క బహిరంగ సభతో మొత్తం కథే మారిపోతుందన్న భావనలో ఉంది ఆ పార్టీ క్యాడర్. అందుకు దుబ్బాక ఎన్నికలను వారు గుర్తుచేస్తున్నారు. నాడు కేసీఆర్‌ దుబ్బాక వెళ్లివుంటే తాము గెలిచేవారమని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.

గెలుపు కోసం సర్వశక్తులు వొడ్డుతున్న టీఆర్‌ఎస్ కు భారీ బహిరంగ సభ పెద్ద విషయం కాదు. కానీ ఎన్నికల సంఘం పెట్టిన కరోనా నిబంధనలు దానికి అడ్డుగా ఉన్నాయి. అయితే కరోనా తీవ్రత గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సడలింపు ఇవ్వాలని గులాబీ పార్టీ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాసింది. దీనిపై నిర్ణయం వెలువడాల్సి వుంది. ఒక వేళ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చినా టీఆర్‌ఎస్‌ నియోజకవర్గం వెలుపల భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే బీజేపీ ఊరకే కూర్చుంటుందా..అంతకన్నా పెద్ద సభనే ప్లాన్‌ చేస్తుంది. అందులో అనుమానం లేదు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారాన్ని హోరెత్తిం చాలని కమలం పార్టీ ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకుంది. దసరా తరువాత పార్టీ శ్రేణులన్నిటిని రంగంలోకి దించనుంది. సర్శశక్తులు జూరాబాద్‌లో మోహరించనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారా న్ని ప్రారంభిస్తారని అంటున్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు మండలాల్లోని గ్రామ గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. గడపగడపకు వెళ్లి ఓటు అడగనున్నారు బండి.

భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలంటే హుజూరాబాద్‌లో గెలిచి తీరాల్సిందే. టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే అనే సందేశం ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలంటే ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సి వుంటుంది. పార్టీ అధినాయకత్వం నుంచి కూడా ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆ పార్టీ రాష్ట్ర శాఖ విస్తృత స్థాయిలో ప్రచార కర్యాక్రమాలు రూపొందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారీ సభతో ప్రచారాన్ని ముగించేలా ప్లాన్‌ చేస్తోంది. ఆ సభతో కేసీఆర్‌ ప్రచార హోరుకు చెక్‌ పెట్టాలన్నది బీజేపీ ఎత్తుగడ. మరి ఈ హోరా హోరీ ప్రచారంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సివుంది.

Exit mobile version