NTV Telugu Site icon

ఏడోసారి ఈటల విజయం.. ఫైనల్‌ మెజార్టీ ఎంతంటే..?

తెలంగాణలో ఉత్కంఠరేపిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్‌ పార్టీ ఆధిక్యంలో నిలిచింది.. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోల్‌ అయ్యాయి.. రౌండ్‌ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. ప్రతీ రౌండ్‌లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలో నిలిచారాయన.. ఫైనల్‌గా చివరి రౌండ్‌ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్‌.. తన ప్రత్యర్థి, టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై 23,855 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు.

హోరాహోరీ పోరు జరిగిన హుజురాబాద్‌లో కమలం వికసించింది.. సర్కార్‌కు సవాల్‌ విసురుతూ ఎన్నికల బరిలోకి దిగిన ఈటల.. తన సత్తాను చాటారు. యుద్ధంలా జరిగిన హుజురాబాద్‌ ఎన్నికల్లో ఈటల విజయం సాధించారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌.. అడుగడునా ఈటలను వెంటాడినా.. ఎక్కడా ఆయనను మించలేకపోయారు. 22వ రౌండ్‌ ఫలితాల్లో 1130 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా బీజేపీ 23,855 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇక, కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు చెప్పుకోతగినన్ని ఓట్లు కూడా పడలేదు.

తొలి ఐదు రౌండ్లలో హుజురాబాద్‌ ఓట్లను లెక్కించారు.. మొదటి రౌండ్‌లో 166 ఓట్లతో మొదలైన ఈటల రాజేందర్‌ మెజార్టీ ప్రస్తానం.. ఐదో రౌండ్‌ వచ్చేసరికి 2169కి చేరింది.. ఇక్కడ నెక్‌ టు నెక్ ఫైట్‌ జరిగినా ఓటర్లు మాత్రం ఈటల వెనుకే నిలబడ్డారు. ఇదే ట్రెండ్‌ 6, 7 రౌండ్లలోనూ కనిపించింది. ఆరో రౌండ్‌లో ఈటలకు 1017 ఓట్ల ఆధిక్యం లభించగా.. ఏడో రౌండ్‌ పూర్తయ్యే సరికి ఈటల మెజార్టీ 3432కు చేరింది. కానీ, ఎనిమిదో రౌండ్‌లో కారు దూసుకొచ్చింది. వీణవంక మండలం గెల్లు శ్రీనివాస్‌ వెనుక నిలబడింది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 162 ఓట్ల స్వల్ప ఆధిక్యత లభించింది. అయితే, 9, 10 రౌండ్లలో మళ్లీ ఈటల హవా కనిపించింది. ఇక, 11వ రౌండ్‌లో మళ్లీ టీఆర్ఎస్‌కు 385 ఓట్ల ఆధిక్యం లభించింది.. అప్పటికి ఈటల మొత్తం ఆధిక్యం 5306గా ఉంది. కానీ, ఇక, అక్కడి నుంచి ఈటల వెనక్కి మళ్లి చూడాల్సిన అవసరం రాలేదు.. ప్రతీ రౌండ్‌లోనూ ఈటల లీడ్‌ సాధించారు.. క్రమంగా ఆయన మెజార్టీ పెరుగుతూ పోయింది. ఇక, హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఇది ఏడో సారి కావడం విశేషం. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు ఈటల రాజేందర్.