NTV Telugu Site icon

కెప్టెన్ గా తడబడుతున్న జెస్సీ

Bigg Boss Telugu Season 5 Sep 24th Episode

కెప్టెన్సీ టాస్క్ లో గెలవగానే జస్వంత్ (జెస్సీ) యాటిట్యూడ్ లో, బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిందంటూ కొందరు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తొలి రోజునే ఆరోపణలు మొదలెట్టేశారు. దానికి తగ్గట్టుగానే చాక్లెట్ బోయ్ జెస్సీ… కెప్టెన్ గా తొలి రోజు ఫెయిల్ అయ్యాడు. సభ్యులు క్రమశిక్షణను పాటించకపోవడంతో జెస్సీకి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. హౌస్ మేట్స్ చేసిన ఐదు తప్పులకు గానూ జెస్సీ ఎవరినీ నిందించలేక, తానే గుంజీళ్ళు తీశాడు. డే టైమ్ లో సోఫా వెనుక చిన్నగా కునుకు తీసిన లోబో… కుక్క అరుపులు వినిపించే సరికీ లేచేశాడు. ‘నిద్ర పోయావా?’ అంటూ జెస్సీ అడిగినా, లోబోను కాదని బుకాయించాడు. అయితే… జెస్సీ తనకి తాను శిక్ష వేసుకోవడాన్ని ఇంటిలోని మెజారిటీ సభ్యులు ఖండించారు. కెప్టెన్ గా అతను ఎవరిని దండించినా, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

వరెస్ట్ పెర్ఫామెన్స్ తో మానస్ జైలుకు!
బిగ్ బాస్ సీజన్ 5 మూడోవారంలో మరోసారి వరెస్ట్ పెర్ఫామెన్స్ పై హౌస్ లో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికంగా ఆరుగురు మానస్ పేరును చెప్పారు. దాంతో బిగ్ బాస్ అతనికి జైలు శిక్ష విధించాడు. దానికి ముందు మానస్ – హమిద కు భోజనం ముద్దలు చేసిన తినిపించడం చూసి, లహరి, శ్వేత వర్మ కాస్తంత జెలసీ ఫీలయ్యారు. లహరి అయితే… తనను కొందరు దూరం పెడుతున్నారని, తాను దగ్గరకు వెళ్ళగానే మాట మార్చేయడమో, మౌనంగా ఉండటమో చేస్తున్నారంటూ వాపోయింది. ముందు రోజంతా షణ్ముఖ్ కు దగ్గర కావాలని తపించిన సిరి… మర్నాడు జెస్సీతో తాను డిస్ కనెక్ట్ అయినట్టు తెలిపింది. ఇక మానస్ జైలులో ఉండటంతో సభ్యులు ఎవరో ఒకరు అతనితో కబుర్లు చెబుతూ బోర్ కాకుండా చూశారు.

అతికిందంటే అదృష్టమే!
బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ ను భిన్నంగా ప్లాన్ చేశాడు. ఓ బోర్డ్ పెట్టి.. దానిపైకి నీటి బెలూన్లు దూరం నుండి విసిరేయాల్సిందిగా కోరాడు. ఏ బెలూన్ అయితే బ్లాక్ బోర్డ్ కు అతుక్కుంటుందో దానిపై ఉన్న పేరును బట్టి ఆ పదార్థాలను బిగ్ బాస్‌ సభ్యులకు అందిస్తాడన్నమాట. ఆ గేమ్ లో సన్ని ఏకంగా నాలుగు బెలూన్స్ అంటుకునేలా చేశాడు. ఆ తర్వాత రవి, శ్రీరామ్ రెండేసి బెలూన్స్ పొందారు.

బిగ్ హౌస్ లోకి అనుకోని అతిథి
బిగ్ బాస్ హౌస్ లోకి శుక్రవారం బేబీడాల్ రూపంలో ఓ ప్రత్యేక అతిథి వచ్చింది. అది ఏడకుండా సభ్యులంతా కలిసి చూసుకోవాలని బిగ్ బాస్ ఆర్డరేశాడు. దాంతో ఒకరి తర్వాత ఒకరు ఆ బేబీ డాల్ ను ఎత్తుకుని ఆడించడం మొదలెట్టారు. ఇక నటరాజ్ మాస్టర్ భార్య అతి త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు కలిసి ఆమెకు సీమంతం చేశారు. ఆ విజువల్స్ ను బిగ్ బాస్ టీవీ స్క్రీన్ మీద చూపించే సరికీ నటరాజ్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గత రెండు రోజులుగా బిగ్ బాస్ షో ఎడిటింగ్ అంత సక్రమంగా లేదు. వరెస్ట్ పెర్ఫామెన్స్ టాస్క్ లో అందరి ఒపీనియన్ చూపించలేదు. అలానే దానికి ముందు రోజు జరిగిన మరపురాని తొలి ప్రేమ టాస్క్ లో సైతం అందరి అభిప్రాయాలను టెలికాస్ట్ చేయలేదు. మొత్తం మీద 19వ రోజు ఎలాంటి మెరుపులు, ఉరుములూ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది.