బిగ్ బాస్ సీజన్ 5 రసకందాయంలో పడింది. మూడోవారం హౌస్ లోంచి వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ గా లహరి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్ లో కేవలం 16 మంది ఉన్నారు. అందులో నాలుగో వారానికి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం. ఇంతవరకూ ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంతమందిని నామినేట్ చేయడం ఇదే మొదటిసారి.
ఆ ముగ్గురి మధ్య ఆసక్తికర చర్చ!
లహరి బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వెళుతూనే సిరిని కాస్తంత ఇరిటేట్ చేసింది. ఇక వేదిక మీదకు వెళ్ళి షణ్ముఖ్ ను కెలికింది. అలానే రవి తనతో అబద్ధం ఆడిన విషయం తెలిసిన తర్వాత అతన్ని కూడా సాఫ్ట్ టార్గెట్ చేసింది. మనుషుల ముందు ఒకలా, వెనక ఒకలా బిహేవ్ చేయొద్దంటూ కోరింది. దాంతో రవి, షణ్ముఖ్, సిరి… సోమవారం ఉదయం ఒకచోట చేరి లహరి కామెంట్స్ మీద చర్చ మొదలెట్టారు. షణ్ముఖ్ ను కాస్తంత ఓపికగా ఉండమని రవి చెప్పినా… ‘నేనింతే… నేను నాలానే ఉంటాను. మనిషినే కదా! ఎమోషన్స్ ఉంటాయి’ అంటూ తన నేచర్ ను చెప్పే ప్రయత్నం షణ్ముఖ్ చేశాడు. విశేషం ఏమంటే… నాగార్జున చేసిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని కావచ్చు… షణ్ముఖ్ ఉద్దేశ్యపూర్వకంగానే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జస్వంత్ తో కాస్తంత డిస్టెన్స్ మెయిన్ టైన్ చేశాడు. ఇదే సమయంలో తనకు సిరి క్లోజ్ అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో జస్సీ… ఆమె కిచన్ లోకి రావడం లేట్ అయినందుకు పదిహేను గుంజీలు తీయించాడు.
అతిథికి వీడ్కోలు! కన్నీళ్ళు పెట్టిన నటరాజ్!!
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలో హౌస్ లోకి ఓ అతిథిని పంపాడు. తీరా చూస్తే… అది ఓ బొమ్మ. హౌస్ లోని సభ్యులు దానిని జాగ్రత్తగా చూసుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో దానిని ముద్దుచేసి, ఐదారు రోజుల పాటు బాగానే చూసుకున్నారు. అయితే సోమవారం దానికి బిగ్ బాస్ వీడ్కోలు పలికాడు. తిరిగి దానిని స్టోర్ రూమ్ లో పెట్టేయమని చెప్పాడు. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆ బొమ్మలోనే పుట్టబోయే బిడ్డను చూసుకున్న డాన్స్ మాస్టర్ నటరాజ్… దానికి తిరిగి పంపుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ‘దొంగ ప్రేమలు, దొంగ నాటకాలను నమ్మవద్దం’టూ బొమ్మకు హితవు పలికాడు. మూడు నెలల పాటు తన భార్యకు ఈ బిగ్ బాస్ షో కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ బొమ్మతో చెప్పుకుని బాధ పడ్డాడు. అలానే ఇతర సభ్యులు కూడా కాస్తంత భారమైన హృదయంలోనే ఆ జూనియర్ కు వీడ్కోలు పలికారు.
శ్రీరామ్ – హమిదా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్!
ఇప్పటికే హౌస్ మేట్స్ కు, బయట ఉండి బిగ్ బాస్ షో చూస్తున్న వారికి సింగర్ శ్రీరామ్, యాక్టర్ హమిదా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందనేది అర్థమైంది. హమీదా కారణం ఏమైనా శ్రీరామ్ తో తన అనుబంధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తుంటే, శ్రీరామ్ ఆమెతో అంత చనువుగా మెలగడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ఆమెకు తన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయంలో క్లారిటీ కోరుకుంటున్నాడు. హహిదా నువ్వంటే నాకిష్టం అని చెప్పినా… ఆ ఇష్టం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటని శ్రీరామ్ ప్రశ్నిస్తుండటం విశేషం. మొత్తం వీరిద్దరి అనుబంధంలో ఏదో లోపం అయితే వ్యూవర్స్ కు కనిపిస్తోంది.
ప్రియపై విరుచుకు పడిన లోబో!
నాలుగవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే పూర్తయిపోయింది. పైన చెప్పినట్టుగా ఈ వారం ఏకంగా, అత్యధికంగా ఎనిమిదిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అయితే హౌస్ లోని మెంబర్స్ సైతం ఇతరులను నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలు వారి మధ్య అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బలకు దారితీశాయి. తనతో సరిగా కనెక్ట్ కావడం లేదంటూ ప్రియ లోబో, సన్నీలను తొలుత నామినేట్ చేసింది. ఆ తర్వాత విశ్వ రవి- నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేశాడు. ఇక లోబో ప్రియ- సిరి లను నామినేట్ చేశాడు. ఇందులో ప్రియ పేరును ఉదహరించినప్పుడు… ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని లైట్ గా తీసుకుందని, కామెడీ చేసిందని లోబో వాపోయాడు. అలాంటిదేమీ లేదని ప్రియ సర్ది చెప్పినా వినకుండా ఆవేశంతో ఊగిపోయాడు. తన ప్రేమను తక్కువ చేస్తే ఎవరినీ క్షమించనంటూ ఎగిరెగిరి పడ్డాడు. లోబో ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోయారు. అలానే సిరి తాను లవ్ స్టోరీ చెబుతున్నప్పుడే ఆకలి వేస్తోందంటూ కామెంట్ చేసిందని, అందుకే ఆమెను నామినేట్ చేసినట్టు తెలిపాడు. లోబో చెప్పిన కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయనే భావన అందరికీ కలిగింది. అదే సమయంలో ప్రతి విషయానికి నేను కింద నుండి వచ్చాను అని లోబో చెప్పడాన్ని షణ్ముఖ్ ఖండించాడు. అందరూ అక్కడ నుండే వచ్చామని వివరణ ఇచ్చాడు.
నటరాజ్ మాస్టర్ పంచ్ డైలాగ్స్
నామినేషన్స్ లో భాగంగా మరో ప్రధాన వివాదం నటరాజ్ మాస్టర్ – విశ్వ మధ్య జరిగింది. నటరాజ్ మాస్టర్ విశ్వ – రవిని నామినేట్ చేశారు. విశ్వ యాక్టింగ్ ఎక్కువైందని నటరాజ్ మాస్టర్ కామెంట్ చేయడంతో విశ్వ దానిని ఖండించాడు. తాను అలానే అంటానని నటరాజ్ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరకు నటరాజ్ మాస్టర్ పంచ్ డైలాగ్స్ వేయడంతో హౌస్ ఎప్పటిలానే కాస్తంత వేడెక్కింది. నటరాజ్ మాస్టర్ సైతం ఒక్కో సమయంలో సంయమనం కోల్పోవడం, అన్నీ విషయాలు, అందరి సంగతులు నాకు తెలుసు అన్నట్టు ప్రవర్తించడం సభ్యులను కాస్తంత చికాకుకు గురిచేస్తోంది.
దీని తర్వాత శ్రీరామ్ శ్వేత-యాని మాస్టర్ ను, షణ్ముఖ్ రవి – లోబోను నామినేట్ చేశారు. రవి తనను ఎక్కడో తెలియకుండా ఇన్ ఫ్యుయెన్స్ చేస్తున్నాడనే భావనకు షణ్ణు రావడం విశేషమే! ఇదే క్రమంలో ఆర్జే కాజల్ నటరాజ్ – సన్నీని, ప్రియ యానీ – లోబోను, మానస్ లోబో – నటరాజ్ ను, శ్వేత వర్మ లోబో-రవిని నామినేట్ చేశారు. హమీదా లోబో- నటరాజ్ ను, ప్రియాంక లోబో – కాజల్ ను నామినేట్ చేశారు. ప్రియాంక ఈ సందర్భంగా లోబో పై తీవ్రమైన ఆరోపణ చేసింది. అతను తనను ఒక సందర్భంలో టచ్ చేసిన విధానాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆరోపించింది. సిరి లోబో – యానిని, రవి కాజల్ – నటరాజ్ ను, యాని మాస్టర్ శ్రీరామ్ – సిరిని, సన్ని ప్రియా – కాజల్ ను, జెస్సీ ప్రియాంక – రవిని నామినేట్ చేశారు. ఈ రోజు మొత్తం మీద రవి… శనివారం జరిగిన సంఘటనలు తన జీవితంలోనే దారుణమైనవని చెప్పడం విశేషం. ప్రియతో లహరి గురించి చేసిన కామెంట్స్, ఆ తర్వాత తన తల్లి మీద ఒట్టు వేయడం వంటివి చేసి ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రవిలో జరిగిన ఈ పశ్చాత్తాపాన్ని వ్యూవర్స్ ఎంతవరకూ మనసుకు తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా సోమవారం ముగిసే సమయానికి బిగ్ బాస్ నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్ని, యానీ మాస్టర్ ను నామినేట్ చేశారు. మరి వీరిలో ఈ వారంలో తమ పెర్ఫార్మెన్స్ తో ఎవరెవరు సేవ్ అవుతారో చూడాలి.