NTV Telugu Site icon

టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయి!

Bigg-Boss-5

Bigg-Boss-5

బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయిగా మారిపోయింది. ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’ పోటీ… చివరకు కొట్లాటకు దారితీసింది. మంగళవారం రాత్రి మూడు, నాలుగు గంటల వరకూ మర్నాడు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలనే ఆలోచనే హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా చేస్తూ వచ్చారు. విచిత్రం ఏమంటే.. 30వ రోజున బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఏకంగా ఒంటి గంటకు భోజనం చేశారు. ఆ తర్వాత కూడా ఎవరికి వారు గ్రూపులు కట్టి డిస్కషన్స్ మొదలు పెట్టారు. ముందు రోజు మొదలైన నాణేల దొంగతనం ఎపిసోడ్ మర్నాటికి కూడా పాస్ ఆన్ అయ్యింది. అయితే షణ్ముఖ్, సిరి, జస్వంత్ ఈ ముగ్గురుకి ‘త్రిమూర్తులు’ అనే పదాన్ని ప్రియా కాయిన్ చేసింది. రెండు వైపులా రాజుల ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం కొందరు చేశారు. దాంతో అలా డబ్బులు దొంగిలించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించవద్దంటూ ఇద్దరు రాజకుమారులు ఓ మాట అనుకున్నారు.

మట్టిలో మణిక్యం విజేత రవి
ఇక వెస్లింగ్ పిట్ లో మొదటిసారిగా సన్నీ తరఫు నుండి విశ్వ; రవి వైపు నుండి మానస్ దిగారు. అందులో విశ్వ… మానస్ ను క్షణాల్లో మట్టి కరిపించాడు. ఆ తర్వాత యానీతో రవి టీమ్ కు చెందిన జెస్సీ పోటీపడ్డాడు. అతనే గెలిచాడు. ఇక థర్డ్ టైమ్ పింకీతో శ్వేత తలపడింది. అందులో శ్వేత విజేతగా నిలిచింది. మొత్తంగా మూడింటిలో రెండు పోటీలలో విజేతలుగా నిలిచిన రవినే ‘మట్టిలో మాణిక్యం’ టాస్క్ విజేతగా నిలిచాడు.

అలానే ఆ తర్వాత జరిగిన ‘రాజుగారి గోడ’ టాస్క్ లో మాత్రం సన్నీ విజేతగా నిలిచాడు. గార్డెన్ ఏరియాలో రెండు స్టాండీలను పెట్టి, అందులో సన్నీ టీమ్ అతని ఫోటోతోనూ, రవి టీమ్ అతని ఫోటోలను ఆ స్టాండీలో పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి పెట్టిన ఫోటోలను ప్రత్యర్థి వర్గం కిందపడేసే ఆస్కారం ఉంది. అలా సన్నీ టీమ్ దాదాపుగా పూర్తి స్థాయిలో ఫోటోలు పెట్టిన తర్వాత విశ్వ దురుసుగా అక్కడకు వచ్చి స్టాండీ లోని ఫోటోలన్నీ కింద పడేశాడు. విశ్వాను ఆపే ప్రయత్నం మానస్ చేయగా, శ్రీరామ్ ను కంట్రోల్ చేసే పని జెస్సీ చేశాడు. ఈ గేమ్ లో చివరకు సన్నీకి రెండు, రవికి ఒక ఓటు దక్కాయి. అలా సన్నీ విజేతగా నిలిచాడు.

‘లాక్కో లాక్కో తాడు’!
కెప్టెన్సీ టాస్క్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’లో మూడో ఆటగా బిగ్ బాస్ ‘లాక్కో లాక్కో తాడు’ ను ఆడించాడు. రవి టీమ్ ఒక వైపు, సన్నీ టీమ్ మరో వైపు నిలిచి ఆ తాడును అటు చివర ఇటు చివర పట్టుకుని లాగాలి. ప్రత్యర్థి వర్గం లోని వాళ్ళు ఒకరైనా లైన్ క్రాస్ చేసి ఇవతలకు వస్తే.. వారు ఓడిపోయినట్టే. ఈ ఆటలో సన్నీ బృందం విన్నర్ గా నిలిచింది. తమ గెలుపుకు లోబో సహకరించాడని కొందరు సభ్యులు చెప్పినా, అదంతా టీమ్ వర్క్ అంటూ లోబో దాటేసే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకూ కెప్టెన్ గా ఉన్న శ్రీరామ్ తన ప్లేస్ లో హమిదాను సంచారకురాలిగా నియమించి, తాను రవి తరఫున ‘లాక్కో లాక్కో మేక’ టాస్క్ లో ఆడేందుకు బరిలోకి దిగాడు. కానీ ఫలితం లేకపోయింది. మొత్తం మీద ఇవాళ జరిగిన మూడు టాస్క్ లూ మజిల్ పవర్ కు సంబంధించినవే కావడం విశేషం. ఇందులో శ్రీరామ్ కు ఒకానొక సందర్భంలో దెబ్బలు కూడా తగిలాయి.