NTV Telugu Site icon

గుంట నక్క ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్!

Nataraj

బిగ్ బాస్ సీజన్ 5లో ఏ ముహూర్తాన నటరాజ్ మాస్టర్ ‘గుంటనక్క’ అనే పదాన్ని ఉపయోగించాడో, అప్పటి నుండి దాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియక ఇంటి సభ్యులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో నాగార్జున అడిగినా, టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ నటరాజ్ మాస్టర్ దాటేశాడు. మొత్తానికి ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్‌ అయిన తర్వాత ఆ గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వచ్చినా అంతగా ఎమోషన్ కాని కంటెస్టెంట్స్ నటరాజ్ మాస్టర్ వస్తుంటే కన్నీటి వర్షం కురిపించారు. లోబో, ప్రియాంక, యాని మాస్టర్, హమీద కళ్ళ నుండి చాలాసేపటి వరకూ నీళ్ళు కారుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ నుండి గంభీరంగా వచ్చిన నటరాజ్ వేదిక మీద మాత్రం కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు. ఏమీ సాధించకుండా బయటకు వచ్చేశాననే బాధ అతని ఫేస్ లో కనిపించింది. అయితే… దానిని కూడా నటరాజ్ మాస్టర్ పాజిటివ్ వే లో తీసుకోవడం విశేషం. హౌస్ లో కంటే బయటే తన అవసరం ఉందని దేవుడు భావించే ఇలా చేశాడేమోనని నటరాజ్ మాస్టర్ చెప్పడం గ్రేట్. ప్రస్తుతం భార్య ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలన్నదే తన కోరిక కూడా అని నటరాజ్ చెప్పాడు.

సింహం సింగిల్ – అది నేనే!
హౌస్ లోని సభ్యులకు ఒక్కో జంతువు పేరు పెట్టడం మొదటి నుండి నటరాజ్ మాస్టర్ కు అలవాటే. అందుకే నాగార్జున నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోయే ముందు…. బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ కొందరిని జంతువులతో పోల్చమని కోరాడు. అందులో సిరిని పాముతో, లోబోను ఎలుకతో, విశ్వను ఊసరవెల్లితో, శ్రీరామ్ ను మొసలితో, ప్రియాంకను చిలుకతో. మానస్ ను గాడిదతో పోల్చాడు నాటరాజ్. అయితే… అందరినీ పాజిటివ్ యాంగిల్ లోనే నటరాజ్ మాస్టర్ అన్వయించాడు. ఇక వైడ్ బోర్డ్ పై డిస్లే చేసి ఉన్న సింహం బొమ్మ దగ్గర మాత్రం ఎవరి ఫోటోనూ పెట్టకుండా…. ‘సింహం సింగిల్ అది నేనే’ అని మరోసారి స్పష్టం చేశాడు నటరాజ్ మాస్టర్.

‘నిన్నే పెళ్ళాడతా’ @ 25 ఇయర్స్!
అక్టోబర్ 4వ తేదీతో నాగార్జున హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్ళడతా’ మూవీ విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నాగార్జున వేదికపైకి రాగానే బిగ్ బాస్ సీజన్ 5 పార్టిసిపెంట్స్ అంతా కలిసి ఆ సినిమాలోని పాటలకు నర్తించారు. గ్రూప్ సాంగ్స్ కు హౌస్ లోని మెంబర్స్ అందరూ కలిసి డాన్స్ చేయగా, డ్యూయెట్ సాంగ్స్ ను మానస్, ప్రియాంక; షణ్ముఖ్ – సిరి; సన్నీ – ప్రియ; రవి – యానీ; శ్రీరామ్ – హమీద; జెస్సీ – శ్వేత కలిసి అభినయించడం విశేషం. వీరందరికీ నాగార్జున కృతజ్ఞతలు తెలిపి, ఒక సినిమాలోని అన్ని పాటలూ సక్సెస్ కావడం చాలా రేర్ అని చెప్పాడు.

డాన్స్ తో అదరగొట్టిన విశ్వ, ప్రియాంక
హౌస్ లోని సభ్యులందరినీ రెండు జట్లుగా చేసి నాగార్జున సినిమా పేర్లను కనిపెట్టే ఆట ఆడించారు. ఆ తర్వాత ఆ సినిమాలోని పాటకూ ఇద్దర్ని కలిసి డాన్స్ చేయమని నాగార్జున కోరాడు. సినిమా పేరును బట్టి ఒకరు బొమ్మ వేస్తే దాని పేరును చాలా ఫాస్ట్ గా సభ్యులంతా చెప్పేశారు. ‘హలో బ్రదర్, జగదేక వీరుడు – అతిలోక సుందరి, అత్తారింటికి దారేది, పోకిరి, భైరవ ద్వీపం’ సినిమాల పేర్లను అపొనెంట్ గ్రూప్ సభ్యులు చెప్పేశారు. అయితే ‘రారండోయ్ వేడుక చూద్దాం, ఛత్రపతి’ చిత్రాల పేర్లను మాత్రం చెప్పలేకపోయారు. ఈ సందర్భంగా సినిమా పాటలకు అందరూ అద్భుతంగా నర్తించారు. అయితే ‘భైరవ ద్వీపం’లోని నరుడా ఓ నరుడా పాటకు విశ్వ, ప్రియాంక అభినయం మరో లెవెల్ లో ఉంది. విశ్వ షర్ట్ తీసేసి తన సిక్స్ ప్యాక్ ను ప్రదర్శిస్తే, ప్రియాంక మేని అందాలతో ఆకట్టుకుంది. ఈ టాస్క్ లో శ్రీరామ్ లీడర్ గా ఉన్న ‘ఎ’ టీమ్ విజయం సాధించింది. హమీద లీడర్ గా ఉన్న ‘బి’ టీమ్ ఓడిపోయింది.

దాక్కో దాక్కో మేక!
నామినేషన్ లో ఉన్న సభ్యులలోని ఆందోళను తగ్గించే క్రమంలో బిగ్ బాస్ కొన్ని ఆటలు ఆడించారు. అందులో ‘దాక్కో దాక్కో మేక’ అనే గేమ్ కూడా ఒకటి. ఇందులో మేక గా హమీదా, జెస్సీ, మానస్, సన్ని, షణ్ముఖ్, లోబో, యాని ఉండగా, పులిగా శ్రీరామ్, శ్వేత, ప్రియాంక, ప్రియా, సిరి, కాజల్, శ్వేత ఉన్నారు. ఓడిపోయిన వారికి నాగార్జున రకరకాల శిక్షలను వేశారు. అందులో భాగంగా లోబో పదిహేను పుషప్స్ తీయాల్సి వచ్చింది. ఈ ఆట చివరిలో నాగార్జున లేడీ కంటెస్టెంట్స్ అందరితోనూ బెల్లీ డాన్స్ చేయించాడు. అందులో హమీదా చాలా బాగా చేసిందంటూ కితాబిచ్చాడు నాగ్!

సేవ్ అయిన క్రమం ఇది!
ఎలిమినేషన్స్ లో ఆదివారం నలుగురు సభ్యులు (యాని, నటరాజ్, సిరి, లోబో) ఉన్నారు. అయితే వేయింగ్ మిషన్ ను గార్డెన్ ఏరియాలో పెట్టిన బిగ్ బాస్ ఈ నలుగురుకి నాలుగు సాండ్ బ్యాగ్స్ ఇచ్చాడు. అందులో ఎవరి బ్యాగ్ ఎక్కువ బరువు ఉంటే వారు సేవ్ అవుతారని చెప్పాడు. అందులో యాని మాస్టర్ శాండ్ బ్యాగ్ అధిక బరువు ఉండటంతో ఆమె తొలుత సేవ్ అయ్యింది. ఇక ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ముగ్గురికి మూడు కవర్స్ ను ఇచ్చారు. అందులో ఎవరి కవర్ లో బ్రోకన్ హార్ట్ ఉంటే వారు అన్ సేఫ్ అని, ఫుల్ హార్ట్ ఉంటే సేఫ్ అని బిగ్ బాస్ చెప్పాడు. నటరాజ్, సిరి, లోబో ఓపెన్ చేసిన కవర్స్ లో కేవలం సిరి కవర్ లోనే అన్ బ్రేక్డ్ లవ్ సింబల్ ఉంది. దాంతో ఆమె సేవ్ అయిపోయింది. చివరగా బిగ్ బాస్ హౌస్ లోని లోబో అండ్ నటరాజ్ మాస్టర్ కు ఈసీజీ పరికరాన్ని అమర్చారు. ఎవరి హార్ట్ బీట్ పడిపోయి గ్రాఫ్ ఫ్లాట్ గా మారితే, వారు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఆ రకంగా నటరాజ్ ఈసీజీ గ్రాఫ్ ఫ్లాట్ గా మారడంతో అతను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన నాలుగో వ్యక్తి అయ్యాడు. చిత్రం ఏమంటే… శని, ఆదివారాలలో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా సేఫ్ – అన్ సేఫ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో సిరి వంతు వచ్చినప్పుడల్లా షణ్ముఖ్ ముఖకవళికలలో ఎంతో ఆదుర్దా కనిపించింది. ఎప్పుడైతే హార్ట్ సింబల్ పూర్తిగా ఉండి సిరి సేఫ్ అయిపోయిందో, షణ్ణు ఆనందంతో ఆమె దగ్గరకు వచ్చి బిగ్ హగ్ ఇచ్చాడు. మరి ఈ సన్నివేశాన్ని చూసి, బిగ్ బాస్ బయట ఉన్న దీప్తి సునయన ఎలా స్పందిస్తుందో చూడాలి.