NTV Telugu Site icon

RRR: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. చరిత్ర సృష్టించిందన్న రాజకీయ ప్రముఖులు

Natu Natu

Natu Natu

‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని చంద్రబాబు అన్నారు. తెలుగు పాట ఈ ఘనత సాధించటం భారతీయ సినిమాకు గర్వకారణమన్నారు. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ బృందానికి ఆయన శుభాభినందనలు తెలియజేశారు.
Aslo Read:Oscar Award: ఇంతకూ ‘నాటు నాటు…’కు ఆస్కార్ ఎలా వచ్చింది!?

నాటు – నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బృందానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు.
చంద్రబోస్ వ్రాసిన పాట, రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ గానం చేసిన నాటు నాటు పాట, చరిత్ర సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరాక్రమాన్ని రెపరెపలాడే విధంగా చేసిందన్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు జనసేనాని పవన్ కల్యాణ్. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ట్రిపుల్ ఆర్ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను అని ఆయన అన్నారు. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది అని గుర్తు చేశారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించిందన్నారు. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘనత పొందేలా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనలు చెప్పారు. ఈ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుందని పవన్ పేర్కొన్నారు.
Also Read:Oscars 95: బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే…

కాగా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ నిచ్చిన పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగోడు గర్వంతో తలెత్తుకుంటున్నాడు.