సిఎం కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా ? వ్యాక్సిన్ తీసుకుంటే.. ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు ? అని మండిపడ్డారు. కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని.. టాస్క్‌ఫోర్స్ కమిటీ వేసి కలక్షన్స్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 20 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది… రానున్న 3 రోజుల్లో మూడు లక్షల డోసులు రానున్నాయన్నారు. తెలంగాణకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 6141040, పంపిణీ చేసిన డోసులు 5447805 అని.. ఆరు లక్షల డోసులు ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్ పంపిణిని ఆపిందని ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడానికి కారణమేంటీ ? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి 20 రోజులు కావస్తుందని.. రైతులు పండించిన ధాన్యంలో 40 శాతం కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు.