NTV Telugu Site icon

బద్వేల్ బైపోల్: కుదేలైన జాతీయ పార్టీలు

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి.

ఇక కేంద్రంలో రెండోసారి ఘనంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు 3 వేల 125 మాత్రమే. అదేఎన్నికల్లో జనసేనకు 4వేల 283 ఓట్లుపడ్డాయి. గెలిచిన వైసీపీకి 84వేల 955 ఓట్లు వస్తే… టీడీపీ 76 వేల 603 ఓట్లు సాధించింది. ఇదీ గత ఎన్నికల్లో పార్టీలు… వాటికి పోలైన ఓట్ల చరిత్ర. విచిత్రం ఏంటంటే.. బీజేపీకి దగ్గరగా.. కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా నోటాకు 3 వేల 31 ఓట్లు పోలవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈసారి కూడా అంతే సీన్.. కాకుంటే కాసిన్ని ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఏడో రౌండ్ లో వైసీపీ 8,741 ఓట్ల ఆధిక్యం. ఏడు రౌండ్ల త‌రువాత వైసీపీకి 60,785 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ 10,301 ఓట్లకు పైగా సాధించగా ఘనమయిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ 2,880 ఓట్లకు మించి సాధించలేకపోయింది. బీజేపీ చివరాఖరికి 21 వేల ఓట్గు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా కమలమ్మ పోటీలో వున్నారు. కాంగ్రెస్ నేతలు తాము భారీగానే ఓట్లు కొల్లగొడతామని భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. చేతికి కోలుకోలేని విధంగా భారీ గాయం అయింది. సంప్రదాయాలను గౌరవించి పోటీనుంచి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.