NTV Telugu Site icon

బద్వేల్‌ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్ తప్పదా?

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన ప్రాతినిధ్యం లేదు. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలో ఆ పార్టీకి సీట్లే లేవు. కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంటే బీజేపీకి కూడా 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు.

బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కినా పరువు నిలుస్తుందా అనేది చర్చనీయాంశమయింది. చనిపోయిన సిట్టింగ్‌ మెంబర్‌ కుటుంబానికే టిక్కెట్‌ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారపార్టీకి ఎదురుగా బీజేపీనే పోటీకి ఉంది. ఈ పరిస్థితుల్లో బద్వేలులో బీజేపీ పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన బద్వేల్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్‌ కూడా దక్కలేదు. కానీ ఈసారి డిపాజిట్‌ కోసం కాకుండా గెలుపు కోసం ఫైట్ చేస్తున్నామనడం బీజేపీ తీరుకి అద్దం పడుతోంది. కనీసం నోటా ఓట్లయినా బీజేపీకి దక్కుతాయా అని అంతా ఎదురుచూస్తున్నారు.

బద్వేలులో సుమారు 2 లక్షల 14 వేల మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. 2019లో లక్షా 50 వేల మంది ఓటేశారు. ఇప్పుడు ఇంకా పెరిగే వీలుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్‌ దక్కాలంటే పోలైన ఓట్లలో ఆరోవంతు రావాలి. ఆ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం 25 వేలకుపైగా ఓట్లు వేయాలి. కానీ ఈ రెండు పార్టీలకు అంత సీన్ లేదని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు.

బీజేపీ అభ్యర్ధి పోటీలో వుండడంతో జనసేన ఓట్లు ఆ పార్టీ అభ్యర్ధికి పడతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి అత్యధిక ఓట్లు వస్తాయనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న జనసేన.. బద్వేల్‌ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. అప్పుడు బీఎస్పీ అభ్యర్థికి కేవలం1321 ఓట్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేయని జనసేన బీజేపీకి మద్దతిచ్చినా భారీగాటీడీపీ, జనసేన ఓట్లే కీలకం కానున్నాయి. టీడీపీ ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున వెంకట సుబ్బయ్య భారీ విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 60.89 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ అభ్యర్థికి 44,734 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈసారి టీడీపీ పోటీలో లేదు. దీంతో టీడీపీకి గతంలో వచ్చిన ఓట్లు ఈసారి ఎవరికి పడతాయి? గతంలో పోటీచేసిన టీడీపీ అభ్యర్ధి ఓబులాపురం రాజశేఖర్ కి 50,748 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్ధికి 32.00శాతం ఓట్లు పడ్డాయి. నోటాకు 2,004 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పీఎం కమలమ్మకు 2,337 ఓట్లు రాగా ఒకశాతం ఓటింగ్ వచ్చింది. దీనిని బట్టి చూస్తే టీడీపీకి పడాల్సిన ఓట్లు కూడా వైసీపీకి పడితే డాక్టర్ సుధకు అక్కడ భారీ మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద పోటీలో వున్న బీజేపీ., కాంగ్రెస్‌లు ఎన్ని ఓట్లు సాధిస్తాయనేది హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికలంటే స్పోర్ట్స్ లాంటివే అనీ. గెలుపు కాదు ముఖ్యం పోటీయే అంటారేమో చూడాలి.