NTV Telugu Site icon

ఏపీ రాజధాని వైజాగ్.. కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం..!

గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. ఎప్పుడైనా విశాఖ కేంద్రం పరిపాలన ప్రారంభం కావొచ్చు అని ఏపీ మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.. అయితే, వైజాగ్‌ రాజధాని దిశగా కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం వచ్చింది.. పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఏపీ రాజధాని వైజాగ్‌గా గుర్తించింది కేంద్రం.

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలపై ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. జులై 26న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రశ్నను లేవనెత్తారు ఎంపీలు.. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రాల రాజధానుల్లో ధరల వివరాలు వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది.. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని స్థానంలో వైజాగ్ గా పేర్కొంది కేంద్రం.. మూడు రాజధానులపై ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే సమాధానం అంటున్నారు వైసీపీ నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నిర్ణయానికి తిరుగేలేదని.. ఎవరు ఎన్ని మాట్లాడిన వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిపాలన ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.