Site icon NTV Telugu

AP: ఇవాళే కీలక భేటీ.. ఆ తర్వాత మంత్రులంతా రాజీనామా..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో చివరి సమావేశాలు అని బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, మంత్రులు ఇచ్చిన రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు స్వయంగా తీసుకుని వెళతారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అదే సమయంలో కొత్త మంత్రి వర్గ జాబితాను గవర్నర్ కు అందజేస్తారు. మరోవైపు ఎవరికి తిరిగి బెర్త్ దక్కుతుంది? ఎవరికి కొత్తగా క్యాబినెట్ లో స్థానం లభిస్తుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. మరోవైపు అశావహులు తీవ్ర ప్రయత్నాల్లో మునిగిపోయారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు జరగనుండడంతో వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్‌.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల్ని కలిసి కీలక అంశాలపై చర్చించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. ఇటు కొత్త జిల్లాల విషయాన్ని కూడా వారికి వివరించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి చర్చలు జరిపారు. హస్తిన నుంచి ఏపీకి చేరుకున్న తర్వాత.. నిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి అపాయింట్‌మెంట్‌ కోరారు సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version