ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుతో పాటు ఏపీపై విరుచుకుపడింది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించాయి. చెరువులకు గండ్లుపడి గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కొన్ని గ్రామాలు వరద నీటి దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలం అవుతున్న వేళ మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే…
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అయితే ఇది కాస్త అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీలో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.