AndhraPradesh Woman: సమాజంలో నేటికీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మహిళలను స్మశాన వాటికల్లోకి రానీయకపోవటం వాటిలో ఒకటి. శవ దహనానికి పేర్చిన కట్టెల గుట్ట (కాష్టం) దగ్గరికి ఆడవాళ్లు వస్తే ‘పాపం’ అని కొన్ని వర్గాల వాళ్లు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే ఆ సామాజిక నిబంధనల కన్నా అంతిమ ‘సంస్కారం’ మిన్న అని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ నిరూపిస్తున్నారు. మానవత్వం పరిమళించిన మంచి మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆమే కానూరి శేషు మాధవి. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఈమె.. స్వగ్రామంతోపాటు వెల్దిపాడులో వృధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
బాలకోటేశ్వరరావు పేరిట సేవా సంఘాన్ని స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. పట్టెడన్నం దొరకని పండుటాకులను, ‘నా’ అనేవారులేని అనాథలను చేరదీయటంతోపాటు వాళ్ల చివరి ప్రయాణాన్ని గౌరవప్రదంగా ముగిస్తున్నారు. ఆ నలుగురిలో నేను సైతం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్ సమయంలో ఆమె నిర్భయంగా అందించిన నిస్వార్థ సేవలను పలువురు మెచ్చుకుంటున్నారు. శేషు మాధవిని శెభాష్ మాధవీ అని మనసారా ప్రశంసిస్తున్నారు.
read also: Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను
మాధవి చేస్తున్న ఈ మానవ సేవలో ఆమె పిల్లలు కూడా పాలు పంచుకుంటూ ఉండటం విశేషం. మాధవి కుమార్తె సునీత, కుమారుడు అశోక్ ఒక వైపు బీటెక్ చదువుతూనే మరో వైపు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆమె చేసే ప్రతి పనిలో తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కొవిడ్ మొదటి దశలో ఎంతో మంది అభాగ్యులకు మాధవి నీడనిచ్చారు. పోలీసులు, ఇతర సామాజిక కార్యకర్తలు దిక్కూ మొక్కూ లేనోళ్లను ఈమె దగ్గరికే తీసుకొచ్చేవారు. కులమతాలకు అతీతంగా మాధవి అందిస్తున్న సేవల గురించి సమీప గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్ గొప్పగా చెప్పారు.
‘మాధవి లాగా ఎవరూ చేయలేరేమో. వయసు మీద పడి, అనారోగ్యంతో కన్నుమూసినవాళ్లను స్మశాన వాటికకు పంపే ముందు తలస్నానం చేయించి, ఒంటి మీద ఏమైనా గాయాలుంటే శుభ్రంగా కడిగి మరీ సాగనంపుతుంది. అంతటి విశాల హృదయం ఎంత మందికి ఉంటుంది?’ అని ఆయన అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఓ 60 ఏళ్ల మహిళ మాధవి దగ్గరే ఉండేది. కొవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. మహమ్మారి పట్ల సర్వత్రా భయానక పరిస్థితులు నెలకొన్న ఆ రోజుల్లో ఆమె మృతదేహాన్ని ఖననం చేయటానికి మాధవికి తోడుగా ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ఆ దయనీయ స్థితిలో డెడ్ బాడీని స్మశానవాటికకు ఒక్కతే తీసుకెళ్లి అంతిమక్రియలను పూర్తిచేసింది. మాధవి పడుతున్న బాధను చూసి ఆమె దగ్గర పనిచేసే ఇద్దరు ఉద్యోగులు మాత్రమే సాయంగా వచ్చారు. మంగమ్మ అనే మరో మహిళకు అంత్యక్రియలు చేసేటప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. చిన్నతనంలో, పెళ్లయ్యాక అనుభవించిన అష్టకష్టాలే తనను ఇలా సంఘ సేవ వైపు మరల్చాయని కానూరి శేషు మాధవి చెప్పారు. మానవ సేవే మాధవ(దేవుడి) సేవ అంటారు కదా. దానికి ఈ మాధవే సరైన నిదర్శనం.