Site icon NTV Telugu

బన్నీ వర్సెస్ చెర్రీ!

Allu Arjun vs Ram Charan to Endorse OTT Brands

పాపులర్ స్టార్ హీరోలకు ఒక్కోసారి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని వారు స్పోర్టివ్ గా తీసుకుంటారు. బట్.. ఫ్యాన్స్ మాత్రం తలకెక్కించుకుని, కిందామీద పడుతుంటారు. గతంలో మల్టీనేషన్ కు చెందిన రెండు బేవరేజ్ కంపెనీలు తమ కూల్ డ్రింక్స్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎదుటెదుట నిలబెట్టాయి. చిరంజీవి ఒక కంపెనీని ప్రమోట్ చేయగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో కంపెనీకి ప్రచారం చేశాడు. ఆ యాడ్ స్క్రిప్ట్ ను సైతం ఈ అన్నదమ్ములు ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకునేలా రాశారు. ఇక ఆ మధ్య ఇలాంటి ఇబ్బందే నాగార్జున, ఆయన కోడలు సమంతకు ఎదురైంది. నాగార్జున ఓ ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ ప్రకటనలో నటించగా, దానికి పోటీ గా మరో డిటర్జంట్ కంపెనీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసి… నాగ్ ప్రకటనకు విభేదించే సంభాషణలను సమ్ముతో చెప్పించింది.

Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!

ఇక లేటెస్ట్ గా ఇలాంటి పోటీ ఒకటి బన్నీ అండ్ చెర్రీ మధ్య మొదలైంది. అల్లు అరవింద్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీకి ఆయన తనయుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. బన్నీతో ఆ మధ్య ఆహా సంస్థ ఓ ప్రమోషనల్ సాంగ్ ను సైతం చిత్రీకరించి, ప్రచారం చేసింది. తాజాగా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ ను ఎంపిక చేసింది. ఇప్పటికే స్టార్ మా ఛానెల్ తో ఉన్న ఒప్పందం కారణంగా బిగ్ బాస్ షోకు చెర్రీని పంపింది. అక్కడ నాగ్ తో ప్రచార గీతాన్ని విడుదల చేయించింది. అటు ఆ కార్యక్రమం టీఆర్పీని పెంచినట్టూ ఉంటుంది, తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ప్రచారం జరిగినట్టూ ఉంటుందన్నది నిర్వహకుల ఆలోచన. ఏదేమైనా లోకల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’తో పోటీ పడబోతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడాన్ని మెగా ఫ్యాన్స్ ఎంత వరకూ పాజిటివ్ గా తీసుకుంటారో చూడాలి!

Exit mobile version