భారత్‌ను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తారాఖండ్, గోవా, మణిపూర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న సమయంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా వేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం, సభలు అంటే వేలాదిగా మంది గుమిగూడే పరిస్థితి ఉంటుంది.. వేగంగా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది.. దీంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఒమిక్రాన్ విస్తరిస్తోండడంతో.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలను రెండు, మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను రిక్వెస్ట్ చేసింది.
అలాగే రాష్ట్రంలో జరిగే బహిరంగసభలు, ర్యాలీపై నిషేధం విధించాలని ప్రధాని నరేంద్ర మోడీని కూడా కోరింది అలహాబాద్ హైకోర్టు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందుకే ర్యాలీలు నిలిపివేయాలని కోరింది. లేదంటే యూపీలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన అలహాబాద్ హైకోర్టు.. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. కరోనా కేసులు పెరగకుండా.. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, ర్యాలీలు, బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలని సూచించిన కోర్టు.. ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లనూ ఎంచుకోవచ్చు అని అభిప్రాయపడింది.. ప్రాణాలు ఉంటేనే మిగతా అంతా కూడా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీంతో.. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేస్తుందా..? హైకోర్టు సూచలన ప్రకారం యూపీ సహా మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.