ఎప్పుడూ ఎవరూ కూడా ఉచితంగా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఒకవేళ అలా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో ఇవ్వొచ్చు. అంతేగాని, చైనాలాంటి దేశాల్లో ఉచితంగా సలహాలు ఇస్తే ఏం జరుగుతుందో, ఎంత నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందో జాక్‌మా వంటి వ్యక్తులకు బాగా తెలుసు. జాక్‌మా చైనా జెయింట్ దిగ్గజ సంస్థ అలిబాబా వ్యవస్థాపకుడు. ఆయన రోజువారి ఆదాయం వందల కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే, అక్టోబర్ 24, 2020న ది బండ్ సమిట్ లో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు జాక్‌మా రాతను మార్చేస్తాయని అనుకోలేదు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ఈ ఉచిత సలహా సూచనల తరువాత ఆయన చాలాకాలం పాటు ఎవరికీ కనిపించలేదు. ఏమయ్యారో తెలియలేదు. ఆ తరువాత క్రమంగా వ్యాపారం మందగించింది. ఎప్పుడూ లాభాల బాటలో నడిచే అలీబాబా కంపెనీ బిజినెస్ ఏడాది కాలంలో ఏకంగా 344 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.25 లక్షల కోట్లు అన్నమాట. చైనాలో ప్రభుత్వానికి ఎవరైనా సరే ఉచితంగా సలహాలు ఇవ్వాలని చూస్తే వారి తలరాతలు ఎలా మారిపోతాయో చెప్పేందుకు ఇదోక ఉదాహరణ మాత్రమే.