NTV Telugu Site icon

60 ఏళ్ళ శ‌భాష్ రాజా

habhsh-Raja

habhsh-Raja

(డిసెంబ‌ర్ 9తో శ‌భాష్ రాజాకు 60 ఏళ్ళు)
న‌ట‌స‌మ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా పి.రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శ్రీ సంస్థ నిర్మించిన శ‌భాష్ రాజా చిత్రం 1961 డిసెంబ‌ర్ 9న విడుద‌ల‌యింది. ఏయ‌న్నార్ స‌ర‌స‌న రాజ‌సులోచ‌న నాయిక‌గా న‌టించిన శ‌భాష్ రాజా మంచి ఆద‌ర‌ణ పొందింది. ఈ చిత్రాన్ని సుంద‌ర్ లాల్ న‌హ‌తా, డూండీ నిర్మించారు.

శ‌భాష్ రాజా చిత్ర క‌థ‌, అంత‌కు ముందు ఏయ‌న్నార్ తో సుంద‌ర్ లాల్ న‌హ‌తా నిర్మించిన శాంతి నివాసం క‌థ‌ను పోలి ఉంటుంది. అంతేకాదు, ఆ చిత్రంలో అన్న‌ద‌మ్ములుగా న‌టించిన కాంతారావు, ఏయ‌న్నార్ ఇందులోనూ అవే పాత్ర‌ల్లో క‌నిపించారు. ఇక కాంతారావు జోడీగా దేవిక‌, నాగేశ్వ‌ర‌రావు జంట‌గా రాజ‌సులోచ‌న కూడా అందులోనూ న‌టించ‌డం గ‌మ‌నార్హం!

ఈ క‌థ విష‌యానికి వ‌స్తే, ర‌ఘు, రాజా అన్న‌ద‌మ్ములు. చిన్న‌త‌నంలో ర‌ఘు చేసిన త‌ప్పిదానికి రాజాపై నేరం మోపుతారు. దాంతో రాజా ఇంట్లోంచి పారిపోతాడు. త‌రువాత ర‌ఘు ఒక్క‌డే కోటీశ్వ‌రుడై, త‌న భార్య స‌ర‌ళ‌తో హాయిగా జీవిస్తూ ఉంటాడు. రాజా బ‌య‌ట పిక్ పాకెట‌ర్ గా జీవ‌నం సాగిస్తూ ఉంటాడు. అత‌ని మిత్రుడు మిరియాలుతో క‌ల‌సి తిరుగుతూ ఉంటాడు రాజా. అత‌నికి డాన్స‌ర్ రాణి అంటే ఎంతో ఇష్టం. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఇలా ఉండ‌గా, ర‌ఘును ట్రాప్ లో ప‌డేయ‌డానికి అత‌ని మేనేజ‌ర్ మ‌ధు ఓ ప‌న్నాగం ప‌న్నుతాడు. మ‌నోర‌మ అనే అమ్మాయిని, ర‌ఘుపై ప్ర‌యోగిస్తాడు. దాంతో ర‌ఘు ఆమెకు బానిస అయి, ఇంటినీ ఇల్లాలినీ నిర్ల‌క్ష్యం చేస్తాడు. ఓ సారి ర‌ఘు ప‌ర్స్ ను రాజా కొట్టేస్తాడు.

అందులో ర‌ఘుతో పాటు స‌ర‌ళ ఫోటో చూసి భార్యాభ‌ర్త‌లు అని తెలుసు కుంటాడు. స‌ర‌ళ త‌న భ‌ర్త ర‌ఘు కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఆమెకు అనుకోని ప‌రిస్థితుల్లో రాజా ఆశ్ర‌య‌మిస్తాడు. అత‌నికి స‌ర‌ళ త‌న వ‌దిన అని తెలుసు. కానీ, ఆ విష‌యం చెప్ప‌డు. రాజా దొంగ అని తెలిసిన రాణి అత‌ణ్ని అస‌హ్యించుకుంటుంది. దాంతో నీతిగా బ‌త‌కాల‌ని ఆశిస్తాడు రాజా. అదే స‌మ‌యంలో మ‌ధు, మ‌నోర‌మ క‌ల‌సి ర‌ఘును మోస‌గించి, డ‌బ్బుతో ఉడాయించాల‌ని చూస్తారు. అప్పుడే అక్క‌డ‌కు వ‌చ్చిన రాణిని, ర‌ఘు గ‌దిలో పెట్టి తాళం వేసి ప‌రార‌వుతారు. రాజా వ‌చ్చే స‌మ‌యానికి తాగిన మైకంలో ఉన్న ర‌ఘు, రాణిని బ‌లాత్కారం చేయ‌బోతాడు. దాంతో రాజా వ‌చ్చి, ర‌ఘును చిత‌క్కొట్టి చంపాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో స‌ర‌ళను చూసి, ఆ ప‌ని విర‌మించుకుంటాడు. ర‌ఘు త‌న త‌ప్పిదాన్ని తెలుసుకొని స‌ర‌ళ‌ను, రాణిని మ‌న్నించ‌మ‌ని వేడుకుంటాడు. పోలీసులు మ‌ధు, మ‌నోర‌మ‌ను ప‌ట్టుకుంటారు. చివ‌ర‌కు రాజా, రాణి పెళ్ళాడ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది.

రాజాగా ఏయ‌న్నార్, రాణిగా రాజ‌సులోచ‌న‌, ర‌ఘుగా కాంతారావు, స‌ర‌ళ‌గా దేవిక, మ‌ధుగా నాగ‌భూష‌ణం, మ‌నోర‌మ‌గా గిరిజ‌, మిరియాలుగా రేలంగి న‌టించారు. ఈ చిత్రానికి స‌ముద్రాల జూనియ‌ర్ ర‌చ‌న చేయ‌గా, ఘంట‌సాల సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమాలోని పాట‌ల‌ను స‌ముద్రాల జూనియ‌ర్, ఆరుద్ర‌, కొస‌రాజు ప‌లికించారు. ఇందులోని అందాల రాణివై..., ఇదిగో ఇదిగో..., మ‌న ఆనంద‌మైన సంసారం...,ఓ వన్నెల వ‌య్యారి..., లోకాన దొంగ‌లు..., వినోద‌ము కోరేవు... వంటి పాట‌లు అల‌రించాయి. శాంతి నివాసం 1960 జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాగా, దాదాపు 22 నెల‌ల త‌రువాత ఈ సినిమా విడుద‌ల‌యింది. ఆ చిత్రానికీ, ఈ సినిమాకు కూడా ఘంట‌సాల సంగీత‌మే ద‌న్నుగా నిల‌చింది. అయినా, అందులో ఇందులో పాత్ర‌లు, పాత్ర‌ధారులు కూడా ఒకే రకంగా ఉండ‌డం వ‌ల్ల ఈ సినిమా ఆ స్థాయి విజ‌యాన్ని సాధించ‌లేక పోయింది.