ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాక తాలిబన్లు ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. రేపటి రోజున ఆఫ్ఘన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొన్ని తాత్కాలిక శాఖలు ఏర్పాటు చేసినా, రేపటి రోజున ప్రభుత్వం కొలువుదీరాక పూర్తిస్థాయి శాఖలు ఏర్పాటు చేయవచ్చు. అయితే, తాలిబన్ల పరిపాలనలో మహిళలకు రక్షణ ఉండదు. వారంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతేకాదు, మహిళలకు హక్కులు ఏ మాత్రం ఉండవు. ఎవరైనా ఎదిరించి బయటకు వస్తే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాలిబన్ నేతలకు షాకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. రాబోయే ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. హెరాత్ నగరంలోని సిల్క్ రోడ్డులో 50 మందికి పైగా మహిళలు ప్లకార్డులు చేతపట్టి రోడ్డు మీదకు వచ్చారు. తమకు ఎలాంటి భయం లేదని, ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మహిళల సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని పేర్కొన్నారు. మరి దీనిపై ఆఫ్ఘన్ తాలిబన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆఫ్ఘన్‌లో రోడ్డెక్కిన మహిళలు… మాకు అవకాశం ఇవ్వండి…
