ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి మరిన్ని చిక్కులు వచ్చిపడే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆర్ధికంగా ఆ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ కూడా పక్కకు తప్పుకోవడంతో మరిన్ని చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, 6 నుంచి 12 తరవగతుల అబ్బాయిలు పాఠశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, అమ్మాయిల విషయంలో తాలిబన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1-5 తరగతుల వరకు అమ్మాయిల పాఠశాల విషయంలో అభ్యంతరం చెప్పని తాలిబన్లు, 6-12 తరగతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వారి చదువు అటకెక్కినట్టే అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఆఫ్ఘన్‌కు మరో ఎదురుదెబ్బ… ఆర్థికంగా ఇక చిక్కులే…
