NTV Telugu Site icon

మరపురాని నటి సుజాత!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామందికి తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ తరం అగ్రకథానాయకు లందరి సరసన సుజాత నాయికగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ అభినయించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు.

సుజాత 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గల్లేలో జన్మించారు. వారి మాతృభాష మళయాళం. ఆమె బాల్యం శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి ‘ఎమకులమ్ జంక్షన్’ అనే మళయాళ చిత్రంలో నటించారామె. తరువాత మరికొన్ని మళయాళ చిత్రాలలో నటిస్తూ సాగారు. ఆ సమయంలోనే కె.బాలచందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇదే తెలుగులో ‘అంతులేని కథ’గా రూపొందింది. బాలచందర్ తెరకెక్కించిన ‘అవర్గల్’ మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇది తెలుగులో ‘ఇది కథ కాదు’గా రీమేక్ అయింది. అలా తమిళ, మళయాళ చిత్రాలలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సుజాతను దాసరి నారాయణరావు తన ‘గోరింటాకు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. దాసరి ఆమెను బాగా ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఏడంతస్తుల మేడ’లో ఏయన్నార్ సరసన, ‘సర్కస్ రాముడు’లో యన్టీఆర్ జోడీగా సుజాత నటించేలా చేశారు. ‘సిరిమల్లె నవ్వింది’లో కృష్ణతో జోడీ కట్టిన సుజాత, ‘బెబ్బులి’లో కృష్ణంరాజుతోనూ అలరించారు. ఆ తరువాత ఏయన్నార్, శోభన్, కృష్ణంరాజు చిత్రాలలో నాయికగా నటిస్తూ సాగారామె. దాసరి తెరకెక్కించి, నటించిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’లో ఆయనకు జోడీగా నటించారు సుజాత. ఏ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సంధ్య’లో సుజాత ప్రధాన పాత్ర పోషించారు. ఆ తరువాత కూడా దాసరి రూపొందించిన పలు చిత్రాలలో సుజాత అభినయించారు.

“గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమతరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు సుజాత. వెంకటేశ్ ‘చంటి’లో తల్లి పాత్రలో అలరించిన సుజాత తరువాత బాలకృష్ణకు తల్లిగా ‘నిప్పురవ్వ, మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘పెళ్ళి’లో పృథ్వీకి తల్లిగా కనిపించారు. ‘ఆటో డ్రైవర్’లో నాగార్జునకు తల్లిగా అభినయించారు. ఇలా అప్పటి టాప్ హీరోస్ కు తల్లిగా నటిస్తూ సుజాత ఎంతగానో అలరించారు. 2011 ఏప్రిల్ 6న చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. తనదైన అభినయంతో ఆకట్టుకున్న సుజాత తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించారు.