NTV Telugu Site icon

20 ఏళ్ళ శ్రియ నటపర్వం

తెలుగు సినిమాలతోనే వెలుగు చూసిన శ్రియా శరణ్ నటిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొలిసారి శ్రియ తెరపై కనిపించిన ‘ఇష్టం’ చిత్రం విడుదలై ఇరవై ఏళ్ళవుతోంది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’ ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. అయినా శ్రియ అందం రసికులకు శ్రీగంధం పూసింది. దాంతో దర్శకుడు దశరథ్ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘సంతోషం’లో శ్రియ అందానికి తగిన పాత్రనిచ్చారు. ‘ఇష్టం’ శ్రియకు అయిష్టం కలిగించినా, రెండవ చిత్రం ‘సంతోషం’ టైటిల్ కు తగ్గట్టుగానే సంతోషం పంచింది. వరుసగా టాప్ స్టార్స్ చిత్రాలలో నాయికగా నటిస్తూ శ్రియ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ స్టార్స్ తోనూ, చివరకు తన కన్నా వయసులో చిన్నవారితోనూ నటించి శ్రియ తనదైన బాణీ పలికించింది. ఈ రీతిన సాగిన తార మరొకరు కానరారు.

‘సంతోషం’లో నాగార్జునతో జోడీ కట్టిన శ్రియ, వెంటనే బాలకృష్ణ సరసన ‘చెన్నకేశవ రెడ్డి’లో నటించేసింది. ఆ పై చిరంజీవితో కలసి ‘ఠాగూర్’లో చిందేసింది. వెంకటేశ్ తో శ్రియ నటించిన ‘సుభాష్‌ చంద్రబోస్’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ తో ‘బాలు’లోనూ, ప్రభాస్ తో ‘ఛత్రపతి’లోనూ, జూ.యన్టీఆర్ తో ‘నా అల్లుడు’లోనూ, మహేశ్ తో ‘అర్జున్’లోనూ శ్రియ చిందేసి కనువిందు చేసింది. టాప్ స్టార్స్ తో తకధిమితై అన్న శ్రియ, స్టార్ హీరోస్ తోనే నటిస్తానని భీష్మించుకోలేదు. తనకు సబ్జెక్ట్ నచ్చితే చాలు, వెంటనే ఓకే చెప్పేసేది. అలా తరుణ్ తో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’ చిత్రాలలోనూ, ఉదయ్ కిరణ్ తో ‘నీకు నేను నాకు నువ్వు’లోనూ, రాజాతో ‘మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు’లోనూ, వేణుతో ‘సదా మీ సేవలో’లోనూ శ్రియ నటించేసింది. అంతెందుకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో కౌశిక్ దర్బాతోనూ , ‘పవిత్ర’లో కౌశిక్ బాబుతోనూ అభినయించి ఆకట్టుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి ‘శివాజీ: ద బాస్’లో శ్రియ అందం చిందేసింది. మోహన్ బాబుతో ‘గాయత్రి’లో కీలక పాత్ర పోషించిందామె. టాప్ స్టార్స్ తో నటిస్తూనే, అప్ కమింగ్ హీరోస్ తోనూ మురిపించిన భామగా శ్రియ పేరు సంపాదించింది.

కేవలం హీరోయిన్ గానే కనిపిస్తాననీ శ్రియ మడి కట్టుకోలేదు. కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లోనూ నర్తించింది. స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఎవరితో నటించినా సరే, తన నాజూకు షోకులను ఎంచక్కా కాపాడుకుంటూ సాగింది శ్రియ. ఆమెకు నటిగా నాగార్జున ‘నేనున్నాను’ మంచి పేరు సంపాదించి పెట్టింది. వెంకటేశ్ ‘తులసి’లో “నే చుకు చుకు బండినిరో…” పాటలో చిందేసి కనువిందు చేసింది. హిందీ చిత్రసీమలోనూ శ్రియ తన సోయగంతో మురిపించింది. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ శ్రియ అందం బంధం వేసింది. “ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్స్ చిల్ర్డన్” వంటి ఆంగ్ల చిత్రాల్లోనూ శ్రియ నటించింది. శ్రియలోని వైవిధ్యాన్ని అభిమానించిన వారందరూ మళ్ళీ ఆమెతో పనిచేయడానికి ఇష్టపడ్డారు. అందువల్లే బాలకృష్ణ తన నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నాయికగా శ్రియనే ఎంచుకున్నారు. తరువాత బాలయ్యతో కలసి ‘పైసా వసూల్’లోనూ శ్రియ నటించింది. యన్టీఆర్ బయోపిక్ ‘యన్టీఆర్ కథానాయకుడు’లో “చిత్రం భళారే విచిత్రం…” పాటలో బాలకృష్ణ సరసన కాసేపు కనిపించిందామె.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’లో అందాలతో అలరించిన శ్రియ, ఆయన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’లోనూ కీలక పాత్ర పోషించారు. జనవరి 7న ఈ సినిమా జనం ముందు నిలవనుంది. దీంతో పాటు ‘గమనం’ అనే తెలుగు చిత్రంలోనూ శ్రియ నటిస్తోంది. వీటితో పాటు ‘నరగాసురన్’ అనే తమిళ మూవీలోనూ, ‘తడ్ఖా’ అనే హిందీ లోనూ శ్రియ నటించింది. ఈ రెండు సినిమాలు కరోనా కారణంగా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇరవై ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నా శ్రియలో అందం రెట్టింపయిందే కానీ, ఏ మాత్రం తగ్గలేదని సినీజనం అంటున్నారు.

తన రష్యన్ బోయ్ ఫ్రెండ్ ఆండ్రే కొశ్చీవ్ ను 2018 మార్చి 12న పెళ్ళాడారు శ్రియ. వారికి ఓ పాప, పేరు రాధ. ఓ వైపు తన సినిమాలతోనూ, యాడ్స్ తోనూ బిజీగా ఉండే శ్రియ, సోషల్ వర్క్ తోనూ బిజీగా ఉంటారు. ‘నాంది ఫౌండేషన్’కు శ్రియ బ్రాండ్ అంబాసిడర్. ‘సేవ్ ఏ ఛైల్డ్ హార్ట్ ఫౌండేషన్’లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనాథలయిన బాలికలకు ఆసరాగా ఉండే ఈ ఫౌండేషన్ లో శ్రియ కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఎయిడ్స్ ను అరికట్టే సంస్థకు ఆర్థిక సహాయమూ అందిస్తుంటారు. జంతు సంరక్షణ కోసం వెలసిన ‘బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా’తోనూ ఆమెకు అనుబంధం ఉంది. నటిగా ఆకట్టుకుంటూనే, సామాజిక సేవలోనూ పాల్గొంటున్న శ్రియ చిత్రసీమలో మరిన్ని వసంతాలు చూస్తూ జనాన్ని మరింతగా అలరిస్తారని ఆశిద్దాం.