మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయడంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానల్ ఉల్లంగిస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులని.. దీన్ని అవకాశంగా చేసుకుని ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ల కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్ సంతకాలు సేకరిస్తోందన్నారు. ఓవ్యక్తి నిన్న సాయంత్రం విష్ణు తరుపున 56 మంది సభ్యుల తరుపున రూ.28 వేలు కట్టారన్నారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.
కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల తరుపున పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరుపు వ్యక్తే కట్టారన్నారు. ఆగంతుకులతో మా ఎన్నికలు నిర్వహిస్తామా ? ఇలా గెలుస్తారా? మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా ? ఈ విషయంపై పెద్దలు కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు. మరి దీనిపై విష్ణు ప్యానెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి!
కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి.
