Site icon NTV Telugu

త్వరపడండి… వచ్చే ఏడాది పెరగనున్న ఇళ్ల ధరలు

జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్ రిపోర్టులో వివరించింది. నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది.

Read Also: అమెజాన్ కీలక నిర్ణయం.. ఇకపై అలెక్సా ర్యాంకులు బంద్

మరోవైపు ఆఫీసు స్థలాలకు కూడా గిరాకీ పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఐదు పెద్ద ఐటీ కంపెనీలు 2.60 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్న వీరు ఆఫీసులకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలం అవసరం అవుతుందని వివరించింది. దీంతో నాణ్యమైన ఆఫీసు స్థలాన్ని కంపెనీలు, ఉద్యోగులు ఇష్టపడుతున్నందున ఆఫీసు స్థల అద్దెలు స్ధిరంగా ఉండటంతో పాటు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఇ-కామర్స్‌ విస్తరణ వల్ల గోడౌన్ స్థలాలకు ఎన్నడూ లేనంత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో 2023 నాటికి 4.59 కోట్ల చదరపు అడుగుల గోడౌన్‌ల స్థలం అవసరమని నైట్‌ ఫ్రాంక్‌ అంచనా వేసింది.

Exit mobile version